వివేకానందరెడ్డి హత్యోదంతానికి సంబంధించి.. సీబీఐ విచారణలో వెల్లడైన వాంగ్మూలాలు అనే ముసుగులో ప్రతిరోజూ పచ్చ పత్రికల్లో సీరియల్ కథనాలు వస్తున్నాయి. నిజంగానే ఈ పత్రికలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్నాయా.. మసాలాలు దట్టించి కిచెన్ జర్నలిజం చేస్తున్నాయా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.
ఎందుకంటే.. తాజాగా వాంగ్మూలంలో తాను వెల్లడించిన వివరాలు అంటూ.. పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని, తాను సీబీఐతో అలా చెప్పనేలేదని.. పులివెందుల ప్రాంతానికి చెందిన కల్లూరు గంగాధర రెడ్డి వెల్లడించారు. ఇతను అవినాష్ రెడ్డి బృందానికి సన్నిహితుడే అని పేర్కొంటూ ఇతను వాంగ్మూలంలో చెప్పిన వివరాల కింద పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే వ్యక్తి నేరుగా తనే మీడియా ముందుకు వచ్చి.. అసలు తను సీబీఐకు ఏమీ చెప్పనేలేదని అంటున్నారు.
అవినాష్ రెడ్డి పేరు చెబితే తనకు యాభైలక్షలు డబ్బులిచ్చేలా వివేకా అల్లుడు తరఫు మనుషులు తనను ప్రలోభపెట్టారని, ఇరవైవేలు ఇచ్చారని, సీబీఐ ఏఎస్పీ దగ్గరకు పంపారని ఆయన అంటున్నారు. ఎఎస్పీ కూడా తప్పుడు సాక్ష్యం చెప్పమని అడిగితే తాను ఒప్పుకోలేదేని, చివరికి తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకుని పంపేశారని కల్లూరు గంగాధర రెడ్డి స్వయంగా మీడియాతో చెప్పారు.
ఈ పరిణామాల్ని విశ్లేషిస్తే..
ఆయన పేరుతో వాంగ్మూలం కింద పత్రికల్లో వచ్చిన కథనాలు నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు. ఆ కథనాలు పూర్తిగా అవినాష్ రెడ్డి, ఆయన మనుషుల పాత్రను తప్పుపట్టేలా ఉన్నాయి. ఆ కథనాల తర్వాత.. గంగాధర రెడ్డి భయపడి మీడియా ముందుకు వచ్చాడనే అనుకుందాం. ఎవరిమీదైతే వివరాలు ఇచ్చాడో.. వారు బెదిరిస్తే.. ఇప్పుడు తాను అసలేమీ చెప్పలేదని బుకాయిస్తున్నాడనే అనుకుందాం.
నిజానికి అలా జరిగే అవకాశం కూడా ఉంది. కానీ.. పులివెందుల ప్రాంతానికి చెందిన, ఎంపీ స్థాయి రాజకీయ నాయకుడితో పరిచయం/అనుబంధం కూడా ఉన్న, పోలీసులు కేసులు తగాదాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి (స్థానికంగా ఇబ్బందులున్నాయని ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఉంటున్నారు) సీబీఐ పోలీసులు తెల్లకాగితాల మీద సంతకం పెట్టమంటే అమాయకంగా పెట్టేస్తారా? అనేది పెద్ద సందేహం.
సందేహం సంగతి పక్కన పెడితే.. ఇదే పరిస్థితులు చంద్రబాబుకు ఎదురై ఉంటే ఆయన ఎలా డీల్ చేసి ఉండేవారు? అనే డౌటు కూడా ప్రజలకు వస్తోంది.
కల్లూరు గంగాధర రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖండించడానికంటె ముందు.. ఆ రెండు పత్రికల రకరకాల సెక్షన్ల కింద ఊపిరి ఆడనివ్వనంతగా సెక్షన్లు బనాయించి కోర్టులో పిటిషన్లు వేయించి ఉండేవారు. తప్పుడు కథనాలతో తన పేరు ముడిపెట్టి.. తన ప్రాణానికి హాని కలిగిస్తున్నారంటూ.. పత్రికల మీద దావా వేయించేవారు. అసలు ఆ పత్రికల్లో ఇలాంటి కథనాలే రాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును డిమాండ్ చేసి ఉండేవారు.
తాను వేయదలచుకున్న పిటిషన్ ను ఎవ్వరిద్వారానో వేయించి.. తాను గట్టుమీదనుంచి చూస్తూ గ్రంథం నడిపించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య! అలా ఈ పాటికి రెండు పచ్చ పత్రికల మీద బోలెడు కోర్టు కేసులు నమోదై ఉండేవి. కానీ.. వైసీపీ నాయకులు ఈ విషయంలో వెనుకబడే ఉన్నారు.
చంద్రబాబునాయుడుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు వారికి లేవు. అందుకే.. కేవలం ఒక ప్రెస్ మీట్ ద్వారా ఖండింపజేసి అంతటితో చేతులు దులుపుకున్నారు. దీనివలన.. ఇంకా రాబోయే ‘వాంగ్మూలాల్ సీరియల్ కథనాలు’ ఆగవు కదా.. మరింతగా పరువు పోవడం ఆగదు కదా! చంద్రబాబు ఇలా చెక్ పెట్టగలిగే సమస్యను, వారు ఇంకా భారంగా మోస్తున్నట్టుగా కనిపిస్తోంది.