స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైసీపీ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో యధావిధిగా టీడీపీ నేతలు రంకెలేస్తున్నారు. కొత్త నాయుకుడు అచ్చెన్నాయుడు వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని సెలవిచ్చారు.
అసలు ఎన్నికలంటే భయం ఎవరికి? 2018 ఆగస్ట్ 1న పంచాయతీల పదవీకాలం ముగిసినా ఎన్నికలకు వెనకడుగేసిన అప్పటి టీడీపీ పిరికితనాన్ని గుర్తు చేయమంటారా? ఏకగ్రీవాలతో వైసీపీకి ఘన మెజార్టీ వస్తున్నసమయంలో కరోనా బూచి చూపి, 'సొంత మనుషుల'తో ఎన్నికలను వాయిదా వేయించుకున్న టీడీపీ చరిత్రని గుర్తు చేయాల్సిన అవసరం ఉందా?
మరో 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా శిఖండిలా నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయించారు చంద్రబాబు. పరోక్షంగా కేంద్రం ఇచ్చే నిధుల్ని అడ్డుకోవాలని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూశారు.
ప్రభుత్వం కుదరదు పొమ్మంటున్నా.. తగుదునమ్మా అంటూ వచ్చి పదవిలో కూర్చుని.. పదవీకాలం పూర్తయ్యేలోగా ప్రభుత్వాన్ని మరోసారి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
అందుకే ఎన్నికల ప్రక్రియ అనే తేనెతుట్టెను కదపడానికి, తద్వారా కొన్ని రోజులైనా అధికార యంత్రాంగంపై అజమాయిషీ చేసే అవకాశం దక్కించుకోడానికి సిద్ధమవుతున్నారు నిమ్మగడ్డ. ఎన్నికలంటూ జరిగితే.. నిమ్మగడ్డ ఎన్ని వన్నెచిన్నెలు పోతారో గతంలోనే అర్థమైంది.
స్థానిక పోరులో ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏకపక్షంగా ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు ఇచ్చిన ఘనత భారత చరిత్రలో ఒక్క నిమ్మగడ్డకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు. పదుల సంఖ్యలో కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ, కేసులు 8 లక్షలకు చేరుకున్నాక తిరిగి ఇప్పుడు జనాల్ని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా..? ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ససేమిరా అంది.
అసలు నిజంగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా దక్కుతాయో లేదో తెలీని పరిస్థితిలో ఉన్న టీడీపీ.. భలే ఛాన్స్ లే అని లోలోపల సంబరపడింది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది.
అసెంబ్లీలో 175 సీట్లకు గాను 151సీట్ల భారీ మెజార్టీ సాధించిన పార్టీకి.. ఏడాదిన్నరలోపు జరగబోతున్న స్థానిక ఎన్నికలు నల్లేరుపై నడకలాంటివి. పైగా.. లోపాయికారీగా అధికార పక్షానికి సాయం చేసేందుకు వైరిపక్షాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఘన విజయం గ్యారెంటీ. అయితే టీడీపీ మాత్రం ఎన్నికల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే దురాలోచనతో ఉంది. నిమ్మగడ్డ భుజంపై తుపాకీ పెట్టి జగన్ కి గురిపెట్టాలని చూస్తోంది.