అమెరికా అధ్యక్ష హోదాలో ఇది వరకూ పలువురు అమెరికన్ నేతలు ఇండియాలో పర్యటించారు. వారు వచ్చిన పని చూసుకుని హుందాగా వెళ్లిపోయారు. వారిలో ఇండియాపై ఎలాంటి అభిప్రాయాలున్నా.. అంత తేలికగా వాటిని వ్యక్తీకరించలేదు. క్లింటన్, బుష్, ఒబామాలు ఇండియాను తమ వ్యాపారానికి ఉపయోగపడే విషయంలో చూసుకున్నారు.
ఇక మోడీ హయాంలో ఇండియాలో పర్యటించిన ట్రంప్ విషయంలో అయితే ప్రభుత్వం ఒక రేంజ్ లో ఏర్పాట్లు చేసింది. ఇండియాలో ఆయనకు స్నేహితుడిలా మోడీ సకల ఏర్పాట్లూ చేసి, భారీ ఆతిధ్యం ఇస్తే.. అమెరికా వెళ్లి ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇండియాను కించపరచడం, భారతదేశాన్ని బెదిరించడానికి కూడా ట్రంప్ వెనుకాడటం లేదు.
కరోనా గ్రస్తులకు మందులను అందించే విషయంలో ఇండియా తను కోరినట్టుగా అమెరికాకు సప్లై చేయకపోతే ఆ తర్వాత వ్యవహారం వేరేలా ఉంటుందని బాహాటంగా బెదిరించాడు ట్రంప్. ఇండియాపై దాడి అనేంత తీవ్ర స్థాయి వ్యాఖ్యానాన్ని చేశాడు. ఇక ఇండియాకు నచ్చని కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం అనే మాటను అనేక సార్లు ప్రస్తావించాడు. ఇక తాజాగా అయితే ఇండియాలో గాలే రోత అని వ్యాఖ్యానించాడు వదరబోతు ట్రంప్.
ఈ నేపథ్యంలో మోడీ తీరుపై విమర్శలు వస్తున్నాయి! ట్రంప్ విషయంలో మోడీ చాలా కష్టపడ్డారు! ఆయన ఇండియాకు వస్తే.. గుజరాత్ లో మురికివాడలు కనిపించకుండా గోడలు సైతం నిర్మించారు! మోడీ భక్తులు ట్రంప్ కు వీరాభిమానులయ్యారు! కట్ చేస్తే.. ట్రంప్ తన తీరుతో ఇండియాను అవమానించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. దీంతో ఇది వరకూ ట్రంప్ కోసం మోడీ చేసిన ఏర్పాట్లను, వీరి సాన్నిహిత్యాన్ని అనేక మంది ఎద్దేవా చేస్తూ ఉన్నారు.