అప్పుల్లో రాష్ట్రం.. జగన్ కు ఎందుకంత ధైర్యం?

4 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగా భర్తీ చేసిన ఘనత రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఏ ముఖ్యమంత్రికీ దక్కలేదు. అది ఘనతే కాదు, అంతకు మించి…

4 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోగా భర్తీ చేసిన ఘనత రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనూ ఏ ముఖ్యమంత్రికీ దక్కలేదు. అది ఘనతే కాదు, అంతకు మించి పెద్ద సాహసం. రాష్ట్రం అసలే లోటు బడ్జెట్ లో ఉంది, మరి వీరి జీతభత్యాలకు డబ్బులెక్కడివి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

అదొక్కటే కాదు, జగన్ తలకెత్తుకున్న ప్రతి పనీ, ప్రతి పథకం ప్రభుత్వంపై అదనపు భారాన్ని పెంచేదే. మరోవైపు ప్రధాన ఆర్థిక వనరైన మద్యం షాపులపై కత్తెర వేశారు జగన్. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే పథకాలకు నిధులెక్కడినుంచి వస్తాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది రాజకీయ నాయకులతో పాటు, సామాన్యుల మదిలోనూ మెదులుతున్న ప్రశ్న.

ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం జగన్ దగ్గరే ఉంది. జగన్ నిర్ణయాలను అత్యంత సమీపం నుంచి గమనిస్తున్న మంత్రి వర్గంలో కొందరికి దీనిపై అవగాహన ఉండి ఉంటుంది. ముఖ్యమంత్రి అయినప్పట్నుంచి జగన్ పాటిస్తున్న పొదుపు మంత్రమే వీటన్నిటికీ సమాధానం అని చెబుతున్నారు వైసీపీలో కీలక నేతలు.

రివర్స్ టెండరింగ్ అనేది అనుకున్నదానికంటే ఎక్కువగా విజయవంతమైంది. ఉచిత ఇసుక పాలసీని తీసేయడం వల్ల ఖజానాకు లాభమే తప్ప నష్టం లేదు. మందు షాపులు తగ్గినా, ఇప్పటి వరకూ మద్యంపై వచ్చే ఆదాయం పెద్దగా తగ్గలేదంటే, ఆ కిరికిరి ఏంటో గత ప్రభుత్వాలకే తెలియాలి.

జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అనవసర ప్రచార హంగామా తగ్గిపోయింది.  సామాన్యులకు అవసరం లేదు అనుకున్న ఏ పనికీ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదు, అది రాజధాని అయినా సరే. అందుకే తాను ప్రవేశ పెడుతున్న నూతన పథకాల నిర్వహణపై ఏనాడూ భయపడలేదు జగన్.

పైగా రాష్ట్రంలో జలసిరులు తాండవిస్తున్న వేళ, రైతుల మోముల్లో సంతోషం వెళ్లివిరుస్తోంది. ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగిత చాలావరకు తగ్గింది. ఈ నేపథ్యంలో తలసరి ఆదాయం, రాష్ట్ర ఆదాయం కూడా కచ్చితంగా పెరుగుతుంది. అందుకే జగన్ అంత ధీమాగా ఉన్నారు. దుబారాని తగ్గించి, అవసరమైన చోట, అవసరమైన వారికి సాయాన్ని అందిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.

ఓవైపు అప్పులు చేస్తున్నప్పటికీ వాటిని సరైన మార్గంలో వినియోగిస్తుండడం వల్ల కచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే జగన్ భయపడడం లేదు. ప్రతిపక్షాలకు మాత్రం ఇది అర్థంకాక, అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారు.