వాళ్లకు జీతాలు పడ్డాయి.. మన జేబులకు చిల్లులు పడ్డాయ్

రెండూ ఒకేసారి జరిగాయి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిన్న, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో 52 రోజుల సమ్మె కాలానికి గాను వేతనాలు పడ్డాయి. అదే సమయంలో, ఇవాళ్టి నుంచి ప్రయాణికుల జేబులకు…

రెండూ ఒకేసారి జరిగాయి. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిన్న, ఈరోజు ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో 52 రోజుల సమ్మె కాలానికి గాను వేతనాలు పడ్డాయి. అదే సమయంలో, ఇవాళ్టి నుంచి ప్రయాణికుల జేబులకు చిల్లులు  పడే కార్యక్రమం కూడా మొదలైంది. అటు కార్మికులపై వరాల జల్లు కురిపిస్తూనే, ఇటు ప్రజలపై టిక్కెట్ ధరల పెంపు భారాన్ని మోపారు ముఖ్యమంత్రి. అలా పెంచిన టిక్కెట్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.

ఈరోజు ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో బయల్దేరే బస్సు నుంచి టిక్కెట్ చార్జీలు అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్ కు 20 పైసలు పెంచారు. ఇక్కడే ఓ మతలబు ఉంది. 20 పైసల్లో ఏముందిలే అనుకోవడానికి వీల్లేదు. దూరప్రయాణాలు చేసేవాళ్లకు ఆ భారం ఏంటనేది అర్థమౌతుంది. అలాగని దగ్గర దగ్గర ప్రయాణించే వాళ్లను కూడా వదల్లేదు కేసీఆర్. సిటీ బస్సుల్లో మినిమం చార్జీని 5 రూపాయల నుంచి 10 రూపాయలు చేశారు. అంటే జేబులో 10 ఉంటేనే బస్సు ఎక్కాలన్నమాట.

ఇక్కడితో మోత ఆగిపోలేదు. బస్సు కేటగిరీ బట్టి కూడా ధరలు, కనీస ఛార్జీలు మారిపోయాయి. మెట్రో ఎక్కాలంటే 10 చాలదు, 15 రూపాయలు కావాలి. డీలక్స్ అయితే 15 చాలదు, 20 రూపాయలు కావాలి. సూపర్ లగ్జరీ ఎక్కాలంటే 20 చాలదు, 25 రూపాయల కనీస ఛార్జీ చెల్లించాలి. ఇలా దాదాపు 18శాతం ధరలు పెరిగాయి. ప్రయాణికులపై ఈ అదనపు భారం విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా 850 కోట్ల రూపాయలు.

పెరిగిన టిక్కెట్ ధరల ఆధారంగా బస్ పాస్ ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ ఆర్డినరీ బస్సుకు నెలవారీ 770 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 950 రూపాయలు చేశారు. మెట్రో పాస్ చార్జీ 880 నుంచి 1070 రూపాయలకు పెరిగింది. నిజానికి ఈ పెంపు నిన్నట్నుంచే అమల్లోకి రావాలి కానీ చార్జీల పెంపుకు సంబంధించి టెక్నికల్ సమస్యలు రావడంతో ఇవాళ్టి నుంచి అమలు చేస్తున్నారు. 

ఇవన్నీ పైకి కనిపించే మోతలు. ప్రయాణికులకు మెల్లమెల్లగా అర్థమయ్యే మోత ఇంకోటి ఉంది. అదే రూట్లు తగ్గించడం, సర్వీసులు లేపేయడం. అవును.. నష్టాలు తగ్గించుకునేందుకు ఉదయం, రాత్రి వేళల్లో ట్రిప్పులు తగ్గించేయాలని నిర్ణయించింది ఆర్టీసీ. నిజానికి ఈ వేళల్లో పెద్దగా ఆక్యుపెన్సీ ఉండదు. కానీ అత్యవసర ప్రయాణాలు ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసులు అందిస్తోంది ఆర్టీసీ. ఇకపై ఇలాంటి మానవీయ కోణం ఆర్టీసీలో కనిపించకపోవచ్చు.