ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకొంది. ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్రం ఇచ్ఛాపురం వరకు సాగింది.
దాదాపు 14 నెలల పాటు జరిగిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో నాడు ప్రతిపక్ష నేతగా లక్షలాది మంది ప్రజల గోడు విన్నారు. ‘నేను విన్నాను -నేను ఉన్నాను’ అనే భరోసా కల్పించడంలో వైఎస్ జగన్ విజయవంతమయ్యారు.
సుదీర్ఘ పాదయాత్రలో వేసిన అడుగులు ఆయన్ని అధికార పీఠం వైపు నడిపించాయి. పాదయాత్రలో ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలుకు నోచుకుంటున్నాయి. ఇప్పటికే 90 శాతం పైగా పథకాల్లో లబ్ధిదారులకు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజల్లో నాడు -ప్రజల కోసం నేడు’ పేరిట నేటి నుంచి పదిరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరిగి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయోమో తెలుసుకుంటాయని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇంత వరకూ అంతా బాగుంది.
నాడు కష్టకాలంలో జగన్‌కు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులను పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందనే ఆవేదన ఉంది. ఎంత సేపూ సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలే తప్ప … పార్టీకి సంబంధించి ఏ ఒక్క సమావేశం జరగలేదనే చెప్పాలి.
ఇటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తమ గోడు వినిపించుకోవడం లేదని కార్యకర్తలు, దిగువ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఒక్కోసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేలేమో అనే నిరాశపూరిత మాటలు కూడా పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి వినిపిస్తున్నాయి.
ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు అంటూ చైతన్య కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చిన పార్టీ పెద్దలు … పార్టీ కోసం ఎన్నడో చెబితే బాగుంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల గోడు జగన్ ఎప్పుడు పట్టించుకుంటారో చూడాలి.