గత పర్యాయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 45 మాత్రమే! అంటే ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజల కన్నా, ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ! దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో 75 నుంచి 80 శాతం వరకూ పోలింగ్ నమోదవుతూ ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల్లో. అదే ఉత్తరాదిన 60 శాతమే ఎక్కువ!
మామూలుగా కూడా హైదరాబాద్ లో సార్వత్రిక ఎన్నికల్లోనే కొంచెం తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంటుంది. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో స్థానికేతరులు ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన వారు అధిక సంఖ్యలో ఉంటారు.
వారు గుర్తింపు కోసం ఓటు హక్కు హైదరాబాద్ లోనే తీసుకున్నా ఓటు వేయడానికి బారులు తీసే పరిస్థితి ఉండదు. దీంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ పోలింగ్ శాతం చాలా చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది.
అంతా బాగున్నప్పుడు పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉన్నప్పుడు 45 శాతం పోలింగ్ అంటే.. హైదరాబాదీలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. నూటికి 55 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితి! ఇక ఈ సారి కరోనా భయాలు ఉండనే ఉన్నాయి. కరోనా భయాల నేపథ్యంలో క్యూల్లో నిలబడానికి చాలా మంది వెనుకాడే అవకాశం ఉంది.
ఆ పై నేతల దూషణభాషణలతో సామాన్యులు ఈ ఎన్నికల ప్రక్రియనే అసహ్యించుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రచార ప్రక్రియలో మత రొచ్చు పతాక స్థాయికి చేరింది. కామ్ గా బతుకీడ్చే సామాన్యులు ఈ రొచ్చులోకి దూరాలని ఏ మాత్రం అనుకోరు. ఈ ప్రభావం పోలింగ్ మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందులోనూ పోలింగ్ రోజున సెలవు. ఆదివారం, సోమవారం సెలవులు. ఈ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ పడింది. అందులోనూ లాక్ డౌన్ అప్పుడు సొంతూళ్లకు వెళ్లిన చాలా మంది మళ్లీ హైదరాబాద్ చేరలేదు. ప్రత్యేకంగా ఓటేయడానికి వారు హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు.
ఈ నేపథ్యంలో క్రితం సారి నమోదైన 45 శాతం ఓటింగ్ పర్సెంటేజ్ అయినా ఈ సారి నమోదవుతుందా? అనేది సందేహంగానే ఉందిప్పటికీ. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ పర్సెంటేజ్ పెంచి, స్పష్టమైన తీర్పును ఇస్తే అదేదైనా మంచిదే.