ప్రభుత్వాల మీద వివిధ రాష్ట్రాల హై కోర్టులు తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వంలోని వారు అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు. తీర్పు ఇచ్చే సందర్భంగా తీర్పు నోట్ లో ఏదైనా రాయొచ్చు కానీ, విచారణ జరిగనన్ని రోజులూ రన్నింగ్ కామెంట్రీలా కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆక్షేపనీయం అని ప్రభుత్వాల్లోని వారు వాపోతూ ఉన్నారు.
కోర్టులకు విచక్షణ అధికారం, స్వతంత్రాధికారం ఉంది కానీ.. తీర్పులతో సంబంధం లేకుండా వ్యాఖ్యానించడం ఏమిటని రాజకీయ నేతలు బాహాటంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కోర్టులు శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తున్నాయని ఇటీవలి స్పీకర్ల సమావేశంలో పలువురు స్పీకర్లు వ్యాఖ్యానించారు. ఈ రెండు వ్యవస్థల మధ్యన ఒకరకంగా ఘర్షణాత్మక వైఖరి నెలకొంటూ ఉంది.
ఇటీవల ఒక రాష్ట్ర హై కోర్టులో అయితే.. అక్కడ విచారణ జరుగుతున్న కేసుతో సంబంధం లేకుండా న్యాయమూర్తి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ విచారణ జరుగుతున్నది ఒక కేసు అయితే, న్యాయమూర్తి మరో అంశంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు!
ఆయన విచారిస్తున్న అంశం గురించి కాకుండా.. ఏదేదో మాట్లాడారు! సుప్రీం కోర్టు పెట్టిన చట్టాలను కూడా ఎత్తేయాలనేంత స్థాయిలో ఆయన తీవ్ర వ్యాఖ్యానం చేశారు, దానికి ప్రభుత్వ తరఫు లాయర్ స్పందిస్తూ.. మీరు విచారిస్తున్న కేసు అది కాదు, ఆ కేసులో మీరూ లేరూ, నేనూ లేము.. దాని గురించి కాకుండా, దీని గురించి స్పందించండనే వాదన వినిపించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.
ఇలా కోర్టు తీర్పులు, అక్కడ జరిగే వాదోపవాదాలు సామాన్యులు కూడా చర్చగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనిస్తున్న ఒక డౌట్ ఏమిటంటే.. ఒక వైపు హై కోర్టులు వివిధ తీర్పులు ఇస్తున్నాయి. ఆ తీర్పుల సందర్భంగా, విచారణల సందర్భంగా తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. ఆ వ్యాఖ్యానాల్లో ఒక్కోసారి హేతుబద్ధత సామాన్యులకు అగుపించదు! తీరా హై కోర్టులు ఇచ్చిన తీర్పులపై సుప్రీం కోర్టు స్టే విధిస్తోంది!
కోర్టు కోర్టుకూ తీర్పు మారడం సంగతెలా ఉన్నా.. హైకోర్టులు ఒక విధంగా తీవ్రంగా స్పందిస్తూ ఉంటే, సుప్రీం కోర్టులు ఆ తీరుకు భిన్నంగా స్పందిస్తున్నాయి! స్టేలు విధిస్తున్నాయి. హై కోర్టుల తీర్పులను సుప్రీం కోర్టు మారిస్తే .. ఆ మార్పు లు మామూలే అనుకోవచ్చు.
అయితే హైకోర్టులు ఘాటుగా స్పందించేసి, విచారణల సందర్భంగానే ధూం..ధాం.. అంటూ స్పందించేసిన తీర్పుల విషయంలో కూడా సుప్రీంలో అందుకు విరుద్ధమైన స్పందనలు వ్యక్తం అవుతుంటే.. ఇందులో ఏది చట్టమో, ఏది న్యాయమో అర్థం గాక సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. సామాన్యుల తర్కానికి అందకుండా పోతోంది న్యాయవ్యవస్థ! అందుకు కారణం సామాన్యులకు కోర్టులకున్నంత మేధస్సు లేకపోవడమేనేమో!