ఇప్పటికే నిషేధితం అయిన పలు చైనీ యాప్స్ తమ యాక్టివిటీస్ ను ఆపేసుకున్నాయి. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, ఎలాగోలా ఇక్కడ మనుగడ సాగించాలని మొదట ఆ యాప్స్ యాజమాన్యాలు ప్రయత్నాలు సాగించాయి. అయితే ఇక వీలుకాదనే క్లారిటీ వచ్చిందో ఏమో కానీ అవి జెండా ఎత్తేస్తున్నాయి. ఇండియాలో యాక్టివిటీస్ ఇక సాధ్యం కావని అలీబాబా గ్రూప్ కూడా తమ యాప్స్ సిబ్బందికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. యూసీ బ్రౌజర్ తో సహా దాని యాక్టివిటీస్ కు ముగింపును ఇచ్చింది.
ఇక తాజాగా ఇండియాలో భారీ లే ఆఫ్ ను చేపట్టిందట హువాయ్. స్మార్ట్ ఫోన్ ఎక్విప్ మెంట్ తయారీలో హువాయ్ పేరెన్నికగల సంస్థ. 2017లో ఇండియాలో బిజినెస్ తో ఈ సంస్థ ఏకంగా 1.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. స్మార్ట్ ఫోన్, టెలికాం కు సంబంధించి ఇండియన్ నెట్ వర్క్ సంస్థలకు కూడా బోలెడంత ఎక్విప్ మెంట్ ను సరఫరా చేసింది హువాయ్. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం కంపెనీలకు అనేక డివైజ్ లను హువాయ్ సరఫరా చేసిందట.
ఇండియాలో ఈ తరహా వ్యాపారంలో ఉన్న చైనీ సంస్థల ప్రమేయాన్ని కూడా తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇండో- చైనా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యం, ఇండియన్స్ లో పెరిగిన చైనా వ్యతిరేకత, కరోనా కష్టం.. వీటన్నిటి ఫలితంగా ఇండియాలో లే ఆఫ్ ను చేపట్టిందట హువాయ్.
చైనీ సంస్థల అధికారిక పే రోల్ లో సిబ్బంది తక్కువగానే ఉంటున్నారు. ఇండియాలో చైనీ కంపెనీలకు థర్డ్ పార్టీ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో హువాయ్ కూడా అలాంటి వారిని తొలగించడానికి రంగం సిద్ధం చేసిందని, ఇండియాలో తన ఆదాయం అంచనాలను కూడా 50 శాతానికి తగ్గించుకుందని సమాచారం.