లాక్ డౌన్ తో దాదాపు 40 రోజులుగా మూతపడిన మద్యం షాపులు నిన్న-సోమవారం నుంచి రీ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం ఒకే రోజు భారీగా లాభాన్ని ఆర్జించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎంతగా అంటే.. ఒక్క బెంగళూరు పరిధిలో నిన్న ఒక్కరోజు అమ్ముడైన మద్యంతో కర్ణాటక ప్రభుత్వానికి దాదాపు 45 కోట్ల రూపాయల లాభం వచ్చిందట! బెంగళూరులో మద్యం దుకాణాల ముందు క్యూలు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన సంగతి తెలిసిందే.
ఆడ, మగ తేడా లేకుండా ఈ సిలికాన్ సిటీలో మద్యం షాపుల ముందు క్యూలు కట్టారు. జీన్స్ లు, టీ షర్ట్ లు వేసుకున్న అమ్మాయిలు కూడా తమ వంతుగా మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. బెంగళూరులోనే పెద్దదైన టానిక్ లిక్కర్ స్టోర్ ముందు భారీ క్యూలు ఏర్పడ్డాయి. అక్కడ నుంచి అనేక మీడియా సంస్థలు కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చాయి. ఇలా మద్యం అమ్మకాలు హాట్ టాపిక్ గా నిలిచాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరులో నిన్న ఒక్కరోజే వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ మళ్లీ లాక్ డౌన్ ను పొడిగిస్తారేమో, మళ్లీ మద్యం షాపులను మూయించేస్తారేమో అనే భయాలతో ఈ జనాలు భారీగా కొనుగోళ్లు చేసినట్టుగా సమాచారం. బాటిళ్ల కొద్దీ, కేసుల కొద్దీ మద్యాన్ని కొనేసుకుని ఇళ్లలో స్టోర్ చేసుకున్నట్టున్నారు. దీంతో చాలా షాపుల్లో నిన్న ఒక్క రోజుతోనే స్టాక్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. లాక్ డౌన్ తో తమ ఆదాయం తగ్గిపోయిందని వాపోతున్న ప్రభుత్వాల్లో కర్ణాటక కూడా ఉంది. ఈ క్రమంలో అలా మద్యం షాపులు తెరిచారో లేదో.. ఒక్క బెంగళూరు పరిధి నుంచినే 45 కోట్ల రూపాయల ఆదాయం అంటే…కర్ణాటక సర్కారుకు ఊరటేనేమో!