మనకు ప్రతిరోజూ సోషల్ మీడియా ద్వారా మిత్రులు, పరిచయస్తులు అనేక పోస్టులు ఫార్వర్డ్ చేస్తుంటారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవి, ఉల్లాసపర్చేవి, స్ఫూర్తిని రగిల్చేవి ఉంటాయి. మనకు నచ్చినవి ఫార్వర్డ్ చేస్తాం, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటాం. కొన్ని రోజు క్రితం వాట్సాప్ ద్వారా నాకు ఓ పోస్ట్ వచ్చింది. ఒక నిమిషం నిడివి ఉన్న ఆ వీడియో క్లిప్‌లో మోటివేషనల్ స్పీకర్ , సైకాలజిస్ట్ అయిన గంపా నాగేశ్వరరావు అనే వ్యక్తికి ఓ యాంకర్ వేసిన ప్రశ్న, దానికి ఆయన ఇచ్చిన జవాబు ఉన్నాయి.
క్లిప్ మీద ‘‘మన సినిమా హీరోలు.. పెద్ద జీరోలు, అసలైన హీరోలు వాళ్లే’’ అనే హెడ్డింగ్ ఉంది.
గంపా నాగేశ్వరరావు ఏ యూట్యూబ్ చానెల్కో ఇచ్చిన ఇంటర్వ్యూలోని భాగంలా ఉంది. అది ప్లే చేసినపుడు అందులో యాంకర్ కనపడరుగానీ ఆమె అడిగిన ప్రశ్న వినిపిస్తుంది. ‘‘మీ బెస్ట్ మూవీ ఏదండీ’’ అని అడుగుతుంది యాంకర్. ‘‘నాకు సినిమాలు పెద్దగా గుర్తులేవండి’’ అని సమాధానం చెబుతారు గంపా. ‘‘మీరు ఇష్టపడే హీరో ఎవరు? ఇప్పుడున్న వారిలోనైనా.. పాతవారి లోనైనా’’ అని మరో ప్రశ్న వేసింది యాంకర్.
దానికి సమాధానంగా ‘‘దే ఆర్ యాక్టర్స్ అండీ.. దే ఆర్ నాట్ హీరోస్’’ అంటారు గంపా. ‘ఐ అగ్రీ’ అంటుంది యాంకర్.
మళ్లీ గంపా నాగేశ్వరరావు కుడిచేయి చూపుడు వేలు పైకెత్తి చూపిస్తూ.. ‘‘దే ఆర్ నాట్ హీరోస్.. రైతన్న హీరో, మిలట్రీ హీరో, పోలీస్ హీరో..వాళ్లు పెద్ద హీరోస్. వీళ్లు పెద్ద జీరోస్. మేకప్ లేకుండా బయట వాళ్లను చూడలేము మనం. కాస్ట్యూమ్స్, డ్రెస్‌లు వాళ్లవికావు. మాటలు వాళ్లవి కావు. ఎత్తిన శివలింగం ఒరిజినల్ కాదు..అదొక అట్టముక్క. వాళ్లు హీరోలేమిటి? పట్టుకున్న తుపాకీ ఒరిజినల్ కాదు.
నా సైనికులు ఒరిజినల్ గన్ పట్టుకుంటారు.. వాళ్లు హీరోలు, పోలీసులు హీరోలు. రైతన్న లేనిదే ఎవరున్నారండి. మా అమ్మ హీరో.. మా నాన్న హీరో. సినిమా హీరోలు.. హీరోలు కాదు. వాళ్లు జస్ట్ యాక్టర్స్. డైరెక్టర్ చెప్పింది చేయాలి. ఐడోన్ట్ హావ్ ఎనీ హీరో. ఐ యామ్ హీరో’’ అని గంపా నాగేశ్వరరావు అనగానే యాంకర్ గట్టిగా చప్పట్లు కొడుతుంది. ‘‘వాళ్ల దగ్గర ఏమీ లేదమ్మా’’ అని ఆయన అంటుండగా వీడియో ఎండ్ అవుతుంది.
గంపా మాటలు విన్నాక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు. తమవైన అభిప్రాయాలు చెబుతుంటారు. తాము చెప్పే అభిప్రాయాలు నిర్మాణాత్మక విమర్శగా ఉండాలేతప్ప అవి ఎవరి మనోభావాలను గాయపర్చేవిగా ఉండరాదన్న నియమాన్ని కొందరు మాత్రమే పాటిస్తారు.
సినీ హీరోలను జీరోలంటూ గంపా ‘ స్వీపింగ్ కామెంట్స్ చేయడం’, అందులోనూ మోటివేషనల్ స్పీకర్ అని చెప్పుకుంటూ ఆయన ఆ విధంగా మాట్లాడటం నాకు ఒకింత బాధ కలిగింది. గంపా నాగేశ్వరావు గారు చెప్పినట్లు.. మన సమాజంలో రైతు, సైనికుడు, పోలీసు నిస్సందేహంగా హీరోలే. ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఆయన కుటుంబంలో ఆయనే ఓ హీరో. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనకు హీరోలే. అందులో అభ్యంతరం లేదు. ఎవరి కుటుంబానికి వారే కథానాయకులు కావాలి కూడా.
అయితే, సినీ హీరోలను హీరోలనడం తనకిష్టం లేదని, దే ఆర్ జస్ట్ యాక్టర్స్ అని అన్న గంపా నాగేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఆయన వ్యక్తిగతం కూడా భావించవచ్చు. కానీ, ‘‘వీళ్లు పెద్ద జీరోలండీ’’ అని గంపా నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం తీవ్ర అభ్యంతరకరం. ఆయనకు సినిమా గురించి, సినీనటుల గురించి మాట్లాడ్డం ఇష్టం లేకపోతే.. యాంకర్ ఆ సబ్జెక్టును ప్రస్తావించినపుడు ‘నో కామెంట్’ అని చెప్పొచ్చు. లేదా, తన దృష్టిలో ఎవరు హీరోలో చెప్పి.. అక్కడితో ముగిస్తే సరిపోయేది.
కానీ.. సినీ హీరోలను కించపర్చేలా ‘‘వాళ్లు పెద్ద జీరోలు’’ అని వారిపట్ల ప్రిజుడీస్ చూపడం చూస్తోంటే.. గంపా నాగేశ్వరరావు కావాలని ఆ ప్రశ్న వేయించుకుని.. సినీ హీరోలపట్ల తన అక్కసును తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ‘సినిమా’ అన్నది ఓ విజువల్ ట్రీట్. సినిమా నిర్మాణానికి టీమ్ వర్క్ జరుగుతుంది. అవసరమైన అన్ని హంగుల్ని సమకూరుస్తారు. సినిమా నేచర్ అలాంటిది. దానిని గ్రహించకుండా సినిమాలో ఒరిజినల్ శివలింగాలు, ఒరిజినల్ గన్లు, సొంత దుస్తులు, సొంత డైలాగులు ఉండవని.. డైరెక్టర్లు చెప్పినట్లు నడుచుకుంటారని అనడంలో అర్థమేమైనా ఉందా? సినీనటులు డైరెక్టర్ చెప్పినట్లుగా నటించకుండా ఇష్టానుసారంగా సొంత డైలాగులు మాట్లాడతారా?
మామూలు ఇంటర్వ్యూకే యాంకర్లు, గెస్ట్‌లు సూట్లు, టైలు ధరిస్తోంటే.. పాత్రోచితంగా సినీనటులు కాస్ట్యూమ్స్ ధరిస్తే తప్పుపట్టాల్సిందేముంది? చివర్లో ముక్తాయింపుగా ‘‘వారి దగ్గర ఏమీ లేదమ్మా’’ అని అన్నారు. సినీనటుల గురించి తెలిసీ తెలియకుండా ఇటువంటి వ్యక్తులు తేలిగ్గా మాట్లాడితే అది నిజం అయిపోతుందా? ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ తదితర హీరోల్లో ఏమీ లేదా? గంపా చెప్పినట్లు వారు కేవలం జీరోలేనా? తగిన అవగాహన, అధ్యయనం, సంస్కారం లేకుండా మాట్లాడటం మోటివేషనల్ స్పీకర్లమని చెప్పుకునేవారికి ఎంత మాత్రం తగదు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే మహానటుడు ‘ఎన్టీ రామారావు’. ఆయన సినిమాలు, నటన గురించి ఎన్ని వందల పేజీలైనా రాయెచ్చు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో ఎన్టీ రామారావు చూపిన నట విశ్వరూపాన్ని ఎవరు మర్చిపోగలరు. హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ మొదలైన చిత్ర రంగాల్లో ఎన్టీఆర్ స్థాయి నటులు బహుశా ఒకరిద్దరు కూడా కనపడరేమో.
ఎన్టీఆర్ కనబర్చిన క్రమశిక్షణ, వృత్తిపట్ల చూపిన అంకితభావం గురించి అందరూ ఎంతో చెబుతారు. తెలుగు సినీ రంగంలో ప్రతిఒక్కరూ ఎన్టీఆర్‌ను చూసి తామెంతో నేర్చుకున్నామని వినమ్రంగా చెబుతారు. ఇక, ఎన్టీ రామారావు రాజకీయ వ్యవస్థలో, ముఖ్యమంత్రిగా పాలనా వ్యవస్థలో చేసిన మార్పు, సృష్టించిన చరిత్ర సామాన్యమైనదా? ఆయన జీవితం స్ఫూర్తిదాయకం కాదా?
గంపా నాగేశ్వరరావుకు ఎన్టీఆర్‌లో ఎలాంటి మెరిట్ కనపడలేదా? కోట్లాది మంది ప్రజలు ఆయనలో ఎలాంటి మెరిట్‌ను చూడకుండానే ఆరాధించారా? తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్నవారు జీరోలవుతారా? నేర్చుకోవడానికి, స్ఫూర్తి పొందడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదా?
ఎన్టీఆర్ సమాకాలీనుడు, తెలుగు చలన చిత్రరంగంలో నట సామ్రాట్‌గా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు గురించి ఒక పెద్ద గ్రంధమే రాయొచ్చు. ఆయన సినిమాలు, ధరించిన పాత్రల మీద అనేక పరిశోధనలు జరిగాయి. మద్రాస్ నుంచి చిత్ర పరిశ్రమ సొంత రాష్ట్రానికి తరలి రావాలన్న ఉద్దేశంతో 70వ దశకంలోనే.. ఎవరూ సాహసం చేయని రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి స్టూడి యో నిర్మాణం చేయడం అక్కినేనికే చెల్లింది. అది ముమ్మాటికి ఓ హీరోయిక్ డీడ్!
అక్కినేని వ్యక్తిత్వం ఎలాంటిదో స్టూడెంట్ డేస్‌లోనే నాకు అనుభవంలోకి వచ్చింది. 1978 లేదా 79లోనో విజయవాడ సమీపం లోని ‘మానికొండ’ అనే గ్రామంలో ‘ఊరంతా సంక్రాంతి’ అనే సినిమా షూటింగ్ జరుగుతోందని, వెళ్లి చూద్దామని నామిత్రులు కొందరు ప్రతిపాదించారు. ఆ సినిమాలో కృష్ణ, అక్కినేని ఇద్దరూ ప్రధాన పాత్రధారులు.
మానికొండ ఓ చిన్న గ్రామం. అక్కడి ఓ పెద్ద భవనంలో షూటింగ్ జరుగుతోంది. మేము ఉదయం 11 గంటల సమయా నికి అక్కడికి చేరుకున్నాం. స్థానికులు కొందరు అప్పటికే అక్కడ గుమికూడి ఉన్నారు. మేము ఆరేడుగురున్నాం. కాసేపటికి అక్కినేని నాగేశ్వరరావు లోపలి నుంచి బయటకొచ్చారు. మేకప్‌లో ఉన్నారు. ఓ సినీ నటుడ్ని సమీపం నుంచి చూడటం నాకదే మొదటిసారి. స్థానికుల్ని అక్కినేని ఆప్యాయంగా పలకరించారు. పంటలెలా పండుతున్నాయని వారిని అడిగారు.
వారితో ముచ్చటిస్తూ ‘‘మేమూ మీలాంటి వాళ్లమే.. ప్రత్యేకతేమీ లేదు. వెళ్లండి.. పని చెడగొట్టుకోవద్దు’’ అని చెప్పి మా దగ్గరకొచ్చారు. మేము కాలేజీ స్టూడెంట్స్మని ఆయనకు అర్థం అయింది. ‘‘కాలేజీ ఎగ్గొట్టి వచ్చారా?’’ అని అడిగారు మమ్మ ల్ని. మేము కాదన్నట్టుగా తలలు అడ్డంగా ఉపాం. ‘‘చదువు ముఖ్యం. దాని తర్వాతే ఏదైౖనా.. బాగా చదువుకోండి.. మీ తల్లిదం డ్రులకు మంచి పేరు తెండి’’ అంటూ ఆయన లోపలకు వెళ్లిపోయారు.
అంతపెద్ద నటుడైన అక్కినేని ఓ తండ్రిలా మాతో మాట్లాడతారని నేను ఊహించలేదు. అక్కినేని నాగేశ్వరరావు ప్రాథమిక స్థాయిలో విద్యను ఆపేశారు. కానీ, ఆయనకు చదువు విలువ తెలుసు. దశాబ్దాల క్రితమే ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో ‘ఏఎన్నార్ కాలేజీ’ ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. సొంత నిధులు వెచ్చించారు. అప్పట్లో ఏఎన్నార్ కాలేజీ ఏర్పాటు కావడం ఆ ప్రాంతంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేసింది. అందులో చదువుకున్న వేలాది మంది స్టూడెంట్స్ ఉన్నతస్థాయికి ఎదిగారు.
నేను జర్నలిస్ట్ అయ్యాక హైదరాబాద్‌లో అక్కినేనిని నాలుగైదు సందర్భాల్లో కలుసుకున్నాను. రవీంద్రభారతిలో, త్యాగరాజగాన సభలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్న పలు కార్యక్రమాలను కూడా వీక్షించాను. అక్కినేని గొప్ప మోటివేషనల్ స్పీకర్. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. జీవితం పట్ల గొప్ప అవగాహన ఉన్న వ్యక్తి. పరమ జీవిత సత్యాలను చెప్పేవారు. తన కుమారుడు నాగార్జున నటించిన ‘శివ’లో హింస ఎక్కువగా ఉందని, అది తనకు నచ్చలేదని ‘శివ’ అభినందన సభ వేదికపైనే నిర్మొహమాటంగా చెప్పారు. అక్కినేని ఓ వాకింగ్ ఎన్సైక్లోపీడియాగా నాకు అన్పించేవారు.
సామాజిక బాధ్యతతో అక్కినేని ‘సుడిగుండాలు’ అనే గొప్ప సినిమా తీశారు. ఈ సినిమా ప్రధానంగా పేరెంటింగ్‌కు సంబంధిం చింది. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించకపోతే జరిగే అనర్థాలను సినిమా ద్వారా ఆనాడే చూపించారు. అప్పట్లో ఆ సినిమా ఒక సంచలనం. అనేక అవార్డులు పొందింది కూడా. ఏఎన్నార్ గురించి ఎంతైనా రాయొచ్చు, చెప్పొచ్చు. ఆయన ‘హీరో’ కాదని ‘జీరో’ అని ఎవరైనా అంటే నవ్వొస్తుంది, వారిపట్ల జాలి కుగుతుంది.
తెలుగు సినిమా చరిత్రలో కృష్ణది మరో అధ్యాయం. ‘అల్లూరి సీతారామరాజు’ వంటి దేశభక్తి సినిమా తీసిన ‘కృష్ణ’ హీరోకాక మరేమవుతారు? గ్రామీణ వ్యవస్థలోని గొప్పదనాన్ని సెల్యులాయిడ్‌పై ఆవిష్కరిస్తూ తీసిన ‘పాడిపంటలు’లో సామాజిక చైతన్యం తొణికిసలాడుతుంది. కృష్ణ గొప్ప ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్. కృష్ణవేణి, తాండ్ర పాపారాయుడు వంటి వైవిధ్యమైన సినిమాు నిర్మించిన కృష్ణంరాజుది తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక అధ్యాయం. అలాగే, ‘బలిపీఠం’ వంటి గొప్ప సినిమాల్లో పనిచేసిన శోభన్‌బాబును ఎవరైనా జీరో అనగరా?
ఇక, స్వశక్తితో, కఠోర శ్రమతో చిన్నస్థాయి నుండి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి ఎంతో మందికి రోల్‌మోడల్ అనడంలో సందేహం ఉందా? తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిది ఇంకో అధ్యాయం. చిరంజీవి సినిమాల్లోనేకాక నిజ జీవితంలో కూడా ఓ హీరోగానే కనిపిస్తారు. రక్తం లభించక సామాన్యులైన ప్రజలు చనిపోతున్న సమయంలో (అప్పటికి బ్లడ్ బ్యాంకు సంఖ్య చాలా తక్కువ) బ్లడ్ బ్యాంకు స్థాపించి.. తన అభిమానులతో రక్తం దానం చేయిస్తూ.. ఆ రక్తాన్ని ఉచితంగా అందిస్తూ లక్ష మంది ప్రాణాలు కాపాడిన, కాపాడుతున్న చిరంజీవిని కేవలం ‘రీల్ హీరో’గా పిలవగలమా? భారత ప్రభుత్వమే వీరి సేవను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులను ప్రదానం చేసింది. వీరి గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది?
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇంకా అనేక మంది యువ నటులు.. తమ నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారిని ఈ హీరోలు ఆదుకుంటున్నారు. గతంలో వచ్చిన తుపాన్లు, వరదలు, కరవుకాటకాలు మొదలుకుని నేటి కరోనా వరకు.. సినీ హీరోలు సాయం చేస్తూనే ఉన్నారు.
కొంత మంది హీరోలు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి పరుస్తున్నారు. అనేక ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల కంటే మోహన్‌బాబు నడుపుతున్న విద్యాసంస్థల్లో కొంత మంది పేదవారికి ఉచితంగా చదువు చెప్పడం గొప్ప విషయం కాదా? తమ రంగంలో ఎంతో ప్రతిభను కనబరుస్తూ సామాజికరంగంలో కూడా పాలుపంచుకుంటున్న వీరిని జీరోలని పిలవడం భావ్యమా? లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే సినిమా పరిశ్రమ సమాజంలో అతిముఖ్యమైన భాగం. సినిమాలేని సమాజాన్ని ఊహించడం కష్టం.
కరోనా సందర్భంగా అనేక మంది సినీనటులు టీవీ చానెళ్లలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మాట్లాడుతూ ‘‘డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు వారు నిజమైన హీరోలు. వారే ఫ్రంట్‌లైన్ వారియర్స్’’ అని సెల్యూట్ చేయడం ఎవరైనా మర్చిపోగలరా? సినిమా హీరోలన్నా, వారి లైఫ్ స్టయిల్ అన్నా చాలామందికి అసూయ. సినిమా హీరోలకు అయాచి తంగా కోట్ల రూపాయలు వచ్చిపడుతున్నాయని భావిస్తారు. కానీ, దాని వెనుక వారి ప్రతిభ, వారు పడే కష్టం గురించి చాలా మంది ఆలోచించరు. వారి గురించి చాలా తేలిగ్గా కామెంట్స్ పాస్ చేస్తుంటారు.
స్వీపింగ్ స్టేట్మెంట్లు, తీర్పు ఇవ్వడం మోటివేషనల్ స్పీకర్ల లక్షణం కాదు. అలా చేస్తున్న వారిని మోటివేషనల్ స్పీకర్లుగా పిలవలేము. వ్యక్తిత్వ వికాసం పేరుతో చాలా ఏళ్లుగా పెద్దఎత్తున వ్యాపారం జరుగుతున్నది. ప్రజలకు కొన్ని మంచి మాటలు చెప్పడంలో తప్పేమీలేదు. అయితే, సమాజంలో కొంతమందిని ఉన్నతంగా చూపడం కోసం సినిమావారిని కించపర్చాల్సిన అవసరం లేదు. కానీ, ఈ రకమైన ధోరణి కొంతమందిలో కనిపిస్తోంది.
ఆ మధ్య ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కూడా సందర్భం లేకుండా ‘‘పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు’’ అని వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకొని వివాహాలు చేసుకోవడం చట్టబద్ధం. ఒకే సమయంలో ముగ్గురు భార్యలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. ఇంత చిన్న విషయాన్ని.. అంత గొప్ప వ్యక్తులు తెలుసుకోకుండా మాట్లాడడం వారి వ్యక్తిత్వంలోని లోపం.
ప్రతి అంశానికి సినీ నటులు ప్రతిస్పందించలేరు కనుక వారిని టార్గెట్ చేయడం మంచిదికాదు. అన్ని రంగాల్లో ఏ విధంగానైతే కొన్ని లోపాలున్నాయో.. సినిమా రంగంలో కూడా ఉండొచ్చు.
గాంధీజీ చెప్పినట్లు మనం ‘‘ఇతరు పట్ల సహనం కనబర్చాలి. వారి పద్ధతులను, విధానాలను, ఎంచుకొన్న వృత్తిని గౌరవించాలి. ఆయా వృత్తుల్లో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి, అభినందించాలి’’. ఆ మహనీయుడి మాటలే ఎప్పటికీ ఆచరణీయం.
-విక్రమ్ పూల