ఏపీలో రికార్డు స్థాయి వ్యాక్సినేష‌న్.. ఇదే క‌దా కావాల్సింది!

కేంద్ర ప్ర‌భుత్వం అందించాలే కానీ, టార్గెట్ కు త‌గిన స్థాయిలో వ్యాక్సినేష‌న్ చేయ‌గ‌ల‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరూపించింది. ఆదివారం రోజున ఏపీలో గ్రామ‌గ్రామానా భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. ప్ర‌తి గ్రామ స‌చివాల‌యం వ‌ద్దా వ్యాక్సినేష‌న్…

కేంద్ర ప్ర‌భుత్వం అందించాలే కానీ, టార్గెట్ కు త‌గిన స్థాయిలో వ్యాక్సినేష‌న్ చేయ‌గ‌ల‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరూపించింది. ఆదివారం రోజున ఏపీలో గ్రామ‌గ్రామానా భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. ప్ర‌తి గ్రామ స‌చివాల‌యం వ‌ద్దా వ్యాక్సినేష‌న్ ఉధృతంగా జ‌రిగింది.

గ్రామాల్లోని ఇంటి ఇంటికీ వెళ్లి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయ‌ని.. అర్హులైన వారు వ‌చ్చి వేసుకోవాల‌ని వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు స‌మాచారం ఇచ్చారు. 45 యేళ్ల వ‌య‌సు పై బ‌డిన వారికి, బాలింత‌లు, ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌ను క‌లిగిన త‌ల్లుల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌గా ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ సాగింది. ఒకే రోజును ఏకంగా 13 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. 

ఇదీ రీతిన వ్యాక్సినేష‌న్ జ‌రిగితే.. రెండంటే రెండు నెల‌ల్లో ఏపీలోని వ‌యోజ‌నులంద‌రికీ వ్యాక్సినేష‌న్ ను దిగ్విజ‌యంగా పూర్తి చేయ‌వ‌చ్చు. ఈ స్థాయిలో వ్యాక్సినేష‌న్ జ‌రిగింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో. ఈ స్థాయిలో ఒకే రోజు 13 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయ‌డం దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు.

ఇది వ‌ర‌కూ ఒకే రోజు ఆరు ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 13 ల‌క్ష‌ల మందికి ఒకే రోజు  వ్యాక్సినేష‌న్ ద్వారా.. ఏపీ రెట్టింపు స్థాయిలో లెక్క‌ల‌తో రికార్డు సృష్టించింది. ఇలా వ్యాక్సినేష‌న్ ను విజ‌య‌వంతంగా, వేగంగా సాగించ‌గ‌ల వ్య‌వ‌స్థ ఉంద‌ని ఏపీ నిరూపించుకుంది.

ఇలా భారీ స్థాయిలో ఒకే రోజు వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డం గొప్ప సానుకూలాంశం. అయితే.. ఈ స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండ‌టం ప్ర‌తి రోజూ సాధ్య‌మేనా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం సులువుగా దొరుకుతోంది. ఇప్ప‌టికైతే అంత సీన్ లేదు. ఒక్కో రాష్ట్రానికి రోజుకు 10 ల‌క్ష‌ల వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.

శ‌నివారం రోజున దేశంలో మొత్తం 38 ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల‌ను వేసిన‌ట్టుగా కేంద్రం ప్ర‌క‌టించింది. గ‌రిష్టంగా రోజుకు 40 ల‌క్ష‌ల డోసులు అందుబాటులోకి వ‌స్తున్నాయ‌నుకున్నా.. అందులో ఏపీ వాటా.. ఏ మూడు నాలుగు ల‌క్ష‌లో ఉండ‌వ‌చ్చు. అంత‌క‌న్నా త‌క్కువా అయి ఉండ‌వ‌చ్చు. 

అందుబాటులో ఉండాలి కానీ, ఒకే రోజు 13 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందించ‌గ‌ల శ‌క్తి ఉంద‌ని మాత్రం ఏపీ నిరూపించుకుంది. ఇంత‌క‌న్నా ఎక్కువ మందికి కూడా వ్యాక్సినేష‌న్ ను అందుబాటులో ఉంచ‌గ‌ల వ్య‌వ‌స్థీకృత‌మైన శ‌క్తిని చాటుకుంది. ప్ర‌స్తుతానికి అయితే.. ప్ర‌తి రోజూ ఈ స్థాయిలో వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు, ఉండ‌దు.

ఆగ‌స్టు ఒక‌టి నాటికి రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ అందించ‌గ‌ల‌మ‌ని ఇది వ‌ర‌కూ కేంద్రం ప్ర‌క‌టించింది. అయితే జూన్ నెల‌లో టార్గెట్ మిస్ అయిపోయింది. జూన్ లో క‌నీసం 12 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను అందించ‌గ‌ల‌మ‌ని ఇది వ‌ర‌కూ కేంద్రం ప్ర‌క‌టించ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదు కోట్ల డోసుల వ్యాక్సినేష‌న్ మాత్ర‌మే జ‌రిగింది ఈ నెల‌లో.

మ‌రో ప‌ది రోజుల స‌మ‌యంలో.. గ‌రిష్టంగా మూడు నాలుగు కోట్ల డోసులు అందుబాటులోకి వ‌చ్చినా, జూన్ నెల టార్గెట్ లో ఏకంగా రెండు మూడు కోట్ల డోసుల వెలితి అయితే ఏర్ప‌డ‌వ‌చ్చు. ఈ ప్ర‌కారం చూస్తే.. వ్యాక్సినేష‌న్ టార్గెట్ రీచ్ కావ‌డం ఇప్పుడ‌ప్పుడే సాధ్యంగా క‌నిపించ‌డం లేదని స్ప‌ష్టం అవుతోంది.