ఓ కిడ్నాప్ కేసును తెలంగాణ-ఏపీ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. ఈ ఘటన నుంచి వైద్యుడ్ని సేఫ్ గా కాపాడారు. హైదరాబాద్ హిమాయత్ సాగర్ దగ్గర్లో (ఓఆర్ఆర్ కు ఆనుకొని) డెంటిస్ట్ గా పనిచేస్తున్నాడు డాక్టర్ హుస్సేన్. నిన్న మధ్యాహ్నం క్లినిక్ నుంచి అతడ్ని కిడ్నాప్ చేశారు దుండగులు.
క్లినిక్ లో ఉన్న హుస్సేన్ సహాయకుడ్ని కొట్టి డాక్టర్ ను కిడ్నాప్ చేశారు. కొద్దిసేపటికి హుస్సేన్ సహాయకుడు బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా కిడ్నాపర్ల కారును గుర్తించారు. అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం ఆధారంగా తపోవనం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు, ఓ వాహనం ఆగకుండా వెళ్లడాన్ని గుర్తించారు. వెంటనే దాన్ని ఛేజ్ చేశారు. రాప్తాడు మండలం బుక్కచర్ల వద్ద వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు పట్టుకున్న వెంటనే నలుగురు కిడ్నాపర్లు సమీపంలో ఉన్న పొలం వెంబడి పారిపోయారు. ఒక కిడ్నాపర్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళ్లతో కట్టి పడేసిన హుస్సేన్ ను రక్షించారు.
కిడ్నాపర్ నుంచి తుపాకి, కత్తి, మత్తు ఇంజెక్షన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కర్నాటకకు చెందిన గ్యాంగ్ గా వీళ్లను గుర్తించారు. వీళ్లు మహారాష్ట్రకు చెందిన మరో గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ వీళ్లంతా కలిసి డెంటిస్ట్ ను ఎందుకు అపహరించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిమాయత్ సాగర్, కిస్మత్ పుర, బండ్లగూడ ప్రాంతాల్లో ఈ డెంటిస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా 3 విల్లాలకు సంబంధించి ఈయన డీల్ చేస్తున్నారట. కాబట్టి ఈయన దగ్గర డబ్బు ఉందనే పక్కా సమాచారంతోనే కిడ్నాప్ కు పాల్పడినట్టు తెలుస్తోంది.