తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అందులోనూ రెండు రోజుల క్రితం విజయశాంతిని ఆమె నివాసంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
సినిమాలో రామలమ్మ పాత్రతోనే అందరూ ఆప్యాయంగా పిలుచుకునే విజయశాంతి రాజకీయాల్లో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్ అని చెప్పక తప్పదు. తెలంగాణ సాధన కోసం సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతగా విజయశాంతికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలుపొందిన విజయశాంతి, కేసీఆర్ వెంట నడిచారు.
విజయశాంతిని తన సోదరిగా అనేక సందర్భాల్లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాళ్ల మధ్య రాజకీయ విభేదాలు రావడంతో, టీఆర్ఎస్‌ను ఆమె వీడాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ఎన్నికల సమయంలో మాత్రమే కీలకంగా తిరుగుతుంటారనే పేరు సొంతం చేసుకున్నారు.
వరుసగా రెండోసారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ బోల్తా పడడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఆ మధ్య మహేశ్‌బాబుతో కలిసి సినిమాలో కూడా నటించి మెప్పించారు. మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ , అది ఆచరణకు నోచు కోలేదు.
తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల్లో మరోసారి ఆమె పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో రాములమ్మ చేరుతారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. అలాగే అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నవంబర్ 10వ తేదీలోపు ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.