ఆన్ లైన్ లో అప్పు తీసుకొని సదరు సంస్థ వేధింపులు భరించలేక సిద్ధిపేటలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా మరువక ముందే అలాంటిదే మరో దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈసారి ఆన్ లైన్ అప్పు దెబ్బకు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలయ్యాడు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సునీల్, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కలిసి రాజేంద్రనగర్ ఏరియాలోని కిస్మత్ పూర్ లో ఉంటున్నాడు. ఇతడికి 6 నెలల పాప కూడా ఉంది. అయితే లాక్ డౌన్ వల్ల తన ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఆన్ లైన్ లో అప్పులు చేశాడు.
ఆన్ లైన్ లో అప్పుడు కాకుండా సునీల్ కు బయట 6 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. సునీల్ తండ్రి పొలం అమ్మి ఆ ఆప్పులు తీర్చేశాడు. వ్యక్తిగత అప్పులు కూడా తీర్చేయాల్సిందిగా సునీల్ కు లక్ష రూపాయలు ఇచ్చాడు. అయితే అంతలోనే సదరు ఆన్ లైన్ సంస్థ వేధింపులకు పాల్పడింది.
సునీల్ ఫొటోలపై డిఫాల్టర్ ముద్రవేసి, అతడి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులందరికీ సునీల్ ఫొటోల్ని వాట్సాప్ చేసింది. ఇతడు అప్పుడు ఎగవేశాడంటూ ప్రచారం చేసింది. దీంతో ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు సునీల్.
బాధాకరమైన విషయం ఏంటంటే.. సునీల్ కు తాజాగా మరో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 7 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది ఆ సంస్థ. అయితే అప్పటికే ఆన్ లైన్ సంస్థ, సునీల్ ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధించడం మొదలుపెట్టింది. దీంతో కొత్త ఉద్యోగాన్ని కూడా కాదనుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.