కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు గడిచిన 6-7 నెలలుగా వార్తలు చూస్తూనే ఉన్నాం. వివిధ దశల్లో కరోనా వ్యాక్సిన్ తయారీ అంటూ హెడ్ లైన్స్ కూడా చూశాం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దేశంలో చాలామంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అవును.. కరోనా వ్యాక్సిన్ వస్తే తొందరగా వెళ్లి వేయించుకోవాలనే ఆసక్తిని భారతీయులు చూపించడం లేదు. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ సర్వే షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. వ్యాక్సిన్ వస్తే తీసుకోవాలా అనే అంశంపై 53 శాతం మంది ఇంకా ఎలాంటి అభిప్రాయానికి రాలేదంట. ఫలితాలు చూసిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామని వీళ్లలో 43 శాతం మంది చెప్పగా.. 10శాతం మంది అసలు తాము వ్యాక్సిన్ తీసుకోమని ఓపెన్ గా చెప్పడం విశేషం.
కరోనా విజృంభించి తీవ్రస్థాయిని దాటిపోయిన నేపథ్యంలో.. తమ శరీరాల్లో ఆ వైరస్ ను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందని చాలామంది చెప్పడం విశేషం. అలాంటప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం ఎందుకని చాలామంది అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇండియాలో మరోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశం లేదని మరికొందరు జోస్యం చెప్పడం కొసమెరుపు.
అయితే ఈ సర్వేలో 47శాతం మంది మాత్రం తాము వాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే మరో ఆలోచన లేకుండా, తాము దాన్ని తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇలా చెప్పిన వాళ్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువమంది ఉన్నారు.
అటు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇలాంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. దేశజనాభాలా దాదాపు నాలుగో వంతు ప్రజలకు కరోనా టీకాపై ఎలాంటి ఆసక్తి లేదని అక్కడ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.
ఓవైపు బైడెన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను భారీ ఎత్తున చేపడతామని చెబుతుంటే.. మరోవైపు 25శాతం మంది అమెరికన్లు తనకు టీకా అక్కర్లేదంటున్నారు. ఇలా చెబుతున్నవారిలో ఎక్కువమంది నల్లజాతీయులు, రూరల్ అమెరికన్లు ఉన్నారు.
కరోనా దెబ్బకు అమెరికా విలవిల్లాడిన సంగతి తెలిసిందే. అత్యథిక మరణాలు ఆ దేశంలోనే సంభవించాయి. అయినప్పటికీ వాక్సిన్ విషయంలో అమెరికన్లు విముఖత చూపడం ఆశ్చర్యం.