'మూడు రాజధానులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకూలంగా ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా. ప్రభుత్వం రిఫరండం నిర్వహించాలి..' ఇదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన డిమాండ్!
చంద్రబాబు నాయుడు డిమాండ్ లు మామూలుగానే అర్థరహితంగా ఉంటాయి. అమరావతి ధ్యాసలో ఆయన చేస్తున్న డిమాండ్లు మరింత నాన్ సెన్సికల్ గా అనిపిస్తాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడైనా రిఫరండం నిర్వహించే పద్ధతి మనకుందా? ఏ రాజకీయ నిర్ణయం విషయంలో అయినా, రాష్ట్రాలను విభజించడం వంటి విషయాల్లో అయినా.. రిఫరండం నిర్వహించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయా?
అసలు అమరావతిని రాజధానిగా ప్రకటించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏ రిఫరండం నిర్వహించారు? ఎవరి అభిప్రాయాలను తీసుకున్నారు? ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా? అలాంటప్పుడు ఏ హక్కుతో ఆయన రిఫరండం నిర్వహించాలనే డిమాండ్ చేస్తున్నట్టు?
మనది రిఫరండాలు నిర్వహించే దేశం కాదు. అలాంటప్పుడు అమరావతి కోసం మాత్రం కొత్త డిమాండ్లు చేస్తారా? ఎలాగూ రిఫరండం నిర్వహించారు అనే ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు ఈ డిమాండ్ చేస్తున్నారు.
అయితే చంద్రబాబు నాయుడుకు అమరావతి కోసం ఒక చక్కటి మార్గం ఉంది. అదే తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడంతో పాటు, తను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లడం.
గతంలో కేసీఆర్ ఇదే పని అనేక సార్లు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గతంలో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా పత్రాలను ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే పని చేయాలి.
తమ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. రాయలసీమ ప్రజలు కర్నూలుకు హై కోర్టులో కోరుకోవడం లేదు, విశాఖ ప్రజలు రాజధాని హోదాను కోరడం లేదంటున్న చంద్రబాబు నాయుడు.. ఆయా ప్రాంతాల్లోని తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లాలి. అప్పుడు అక్కడ ప్రజాభిప్రాయం ప్రస్ఫుటం అవుతుంది.
టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన వారంతా గెలిస్తే.. అప్పుడు టీడీపీ వాదనకు ప్రజా మద్దతు లభించినట్టే. అప్పుడు జగన్ ప్రభుత్వం పై కచ్చితంగా ఒత్తిడి పెట్టినట్టే! అంత చక్కటి రాజకీయ వ్యూహం, గతంలో కేసీఆర్ విజయవంతంగా ప్రయోగించిన అస్త్రం చంద్రబాబు చేతిలోనే ఉంది.
చేయాల్సిందల్లా రాజీనామాలు మాత్రమే, మరి అంత దమ్ముందా? అది లేకుండా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా.. అది చేతగానితనం తప్ప మరోటి కాదని జనాలందరికీ తెలుసు.