అమరావతి ఉద్యమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఏం చేసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు దాన్ని స్వాగతించేలా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతలా అమరావతి కోసం పోరాడితే అది తమకు సానుకూలమైనదిగా భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబుకు ఏపీ మంత్రులు సవాళ్లు విసిరారు. దమ్ముంటే అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని, అమరావతికి మద్దతుగా ఎన్నికలకు వెళ్లి గెలవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు ఏపీ మంత్రి కొడాలి నాని.
అయితే ఈ రాజీనామాల సవాల్ కు తెలుగుదేశం పార్టీ ధైర్యంగా ముందుకు రాగలదా? అంత సీన్ ఉందా? అనేవి శేష ప్రశ్నలు. అలాంటి ధీటైన నిరసనను వ్యక్తం చేసేంత సీన్ చంద్రబాబుకు ఉండకపోవచ్చు.
నిజంగానే అమరావతి మీద శ్రద్ధ ఉంటే చంద్రబాబు నాయుడు రాజీనామాలనే నమ్ముకోవాలి. రాజీనామా చేసి అమరావతికి మూడు ప్రాంతాల్లోనూ మద్దతు ఉందని నిరూపించాలి. టీడీపీకి ఎలాగూ మూడు ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యేలు ఉన్నారు.
జగన్ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని నిరూపించడానికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లడం తప్ప చంద్రబాబుకు మరో మార్గం లేదు.కానీ చంద్రబాబు రాజకీయ తత్వాన్ని గమనించే వాళ్లు మాత్రం ఆయనకు అంత సీన్ లేదని తేల్చి చెబుతారు.
ఇక చంద్రబాబు నాయుడు అమరావతిలో చేసిన ఫీట్లను, ఆయన ప్రసంగాలను జగన్ సొంత పత్రిక సాక్షి ప్రముఖంగా కవర్ చేసింది. అమరావతిలో చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం ఫీట్లను జగన్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అమరావతికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాన్ని హైలెట్ చేసింది.
జగన్ పత్రిక ఇలా చంద్రబాబును అమరావతి హీరోగా చూపుతోందంటే.. ఇందులో ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.చంద్రబాబు నాయుడు అమరావతి కోసమే వచ్చే మూడేళ్లు కూడా పోరాడాలని, అమరావతి ఉద్యమాన్నే ఆయన సాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా ఉంది.
ఆ 29 గ్రామాల్లోని మూడు గ్రామాల నిరసనలకే ఆయన పరిమితం అయిపోతే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా కావాల్సింది కూడా ఏమీ లేకపోవచ్చు. అమరావతికి మద్దతు పలుకుతూ, అమరావతి అంటూ ఆరాటపడుతూ చంద్రబాబు నాయుడు ఒక కుల నేతగా, మూడు గ్రామాల పెద్దగా మారిపోవడానికి మించి ఆయన వ్యతిరేక రాజకీయ పార్టీకి కావాల్సింది ఏమైనా ఉంటుందా?