నిజం నిప్పులాంటిందంటారు. పురుషాధిక్యత రాజ్యమేలుతున్న రంగం చిత్రపరిశ్రమ అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మనవళ్లు, మనవరాళ్ల వయస్సున్న అమ్మాయిల సరసన నటిస్తూ, తమ హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ విషయమై ప్రముఖ నటి, మోడల్ దియా మీర్జా ఫైర్ అయ్యారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిత్రపరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లు పైబడిన హీరో సరసన 19 ఏళ్ల వయస్సున్న హీరోయిన్ జోడీగా నటించడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
ఇదేం విడ్డూరం, ఇదేం చోద్యమని ఆమె గట్టిగా తన నిరసనను వ్యక్తం చేశారు. వయస్సుకు తగ్గ పాత్రల్లో నటిస్తే, దానికో అందం వస్తుందన్నారు. కానీ వయస్సు పైబడినా ఇంకా హీరో పాత్రలు చేయడం దురదృష్టకరమన్నారు.
ఇది పురుషాధిక్య ఇండస్ట్రీ అని ఆమె వ్యాఖ్యానించింది. ఇదే మహిళా నటుల విషయంలో మాత్రం ఉండదన్నారు. వయస్సు పైబడిన నటీమణుల కోసం ఏ ఒక్కరూ కథలు రాయరని దియా విమర్శించారు.
చిత్ర పరిశ్రమలో ఇలాంటి ధోరణులు మంచిది కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఒక వయస్సు వచ్చిన తర్వాత నటీమణులకు అవకాశాలు దక్కక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వయస్సు పైబడిన హీరోలపై దియా మీర్జా హాట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.