అమరావతి జనభేరి బహిరంగ సభలో చంద్రబాబు ఊగిపోయారు. జగన్ సర్కార్‌కు శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా? అని వైసీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. ఒకవేళ మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు సవాల్ విసిరారు.
బాబూనే సవాల్ విసిరిన నేపథ్యంలో ఇక తనతో పాటు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేస్తారని భావించాలి. ఎందుకంటే సవాల్ విసిరే వాళ్లే, ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు ముందుకొస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమార్లు కేసీఆర్‌తో పాటు ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరడాన్ని చూశాం.
ఇప్పుడు చంద్రబాబు కూడా అమరావతి రాజధాని మార్పు విషయంలో అదే మాదిరిగా వ్యవహరించాల్సి ఉంది. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరిన పరిస్థితుల్లో తన వాళ్లతో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. శంకుస్థాపన స్థలాన్ని చూస్తే కడుపు తరుక్కుపోయిందని ఇదే సభలో చంద్రబాబు అన్నారు.
ఒట్ఠి మాటలు కట్టబెట్టి గట్టి మేలు తలపెట్టాలంటే ప్రజాక్షేత్రంలో తలపడడమే సరైన నిర్ణయం. ఎటూ చంద్రబాబుకు ముగ్గురు ఎంపీలు, 18-19 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రాజధానులపై ప్రజానాడి తెలుసుకునేందుకు ఇంత కంటే ఏం కావాలి?
అమరావతి కోసం అంతగా అల్లాడుతున్న బాబుకు, తాను ప్రాణపదంగా ప్రేమిస్తున్న ప్రాంతం కోసం ప్రజాతీర్పు కోరాలని అనిపించడం లేదా? ఒకవేళ పోతే పదవి, వస్తే రాజధాని అనే నమ్మకం చంద్రబాబుకు ఉన్నప్పుడు ఆ మాత్రం త్యాగం చేయలేరా? కేవలం తానిచ్చిన పిలుపు కోసం స్పందించిన 29 గ్రామాల రైతులు స్వ,చ్ఛందంగా 30 వేల ఎకరాల పైచిలుకు భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారని పదేపదే చంద్రబాబు చెప్పడం తెలిసిందే.
అదే ప్రజలు ఇచ్చిన పదవులను అమరావతి కోసం త్యజించాలనే త్యాగనిరతిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. మరెందుకు చంద్రబాబు ఉత్తుత్తి మాటలతో కాలం గడుపుతున్నారో అర్థం కావడం లేదు. కనీసం అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా, తానే రెఫరెండం కోరుతున్న నేపథ్యంలో చంద్రబాబు తనతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామాలు చేయించాల్సిన అవసరం ఉంది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలతో లంకె పెట్టకుండా, తానే ఆ పనికి పూనుకోవాలి. అప్పుడు అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం లభిస్తుంది. కేవలం సవాళ్లు, విమర్శలతో కాలం వృథా చేయడం మంచిది కాదు.
జాతీయ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా , ఆయన రాజీనామా బాట పడితే ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని తలదన్నేలా దేశ , అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే గొప్ప అవకాశం లభిస్తుంది. అప్పుడు ఎటూ జగన్ సర్కార్ ఇరకాటంలో పడుతుంది. కావున చంద్రబాబు రాజీనామాల ముహూర్తం ఎప్పుడో తేల్చాల్సి ఉంది.