టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు ఒక ఓటమి సరిపోనట్టుంది. మళ్లీ మళ్లీ ఓడిపోవాలనో లేక గెలిచేంత వరకూ పోటీ చేయాలనే ఉత్సాహమో తెలియదు కానీ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్బడు కంటే కొడుకు రెండాకులు ఎక్కువే చదివినట్టు లోకేశ్ ట్వీట్ చూస్తుంటే అర్థమవుతోంది.
అమరావతి పోరాటానికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు జనభేరి పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రెఫరెండానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు లోకేశ్ వెంటనే ఓ ట్వీట్ చేశారు. జనభేరితో జగన్‌రెడ్డికి మబ్బులు విడిపోయాయని పేర్కొన్నారు.
ప్రజలు, ప్రాంతాలు, పార్టీలు ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అంటూ.. అమరావతికి జై కొట్టాయని జనభేరీతో తేలిపోయిందని లోకేశ్ స్పష్టం చేశారు. మూడు ముక్కలాటకు కట్టుబడిన జగన్ రెడ్డికి… చంద్రబాబు సవాల్ స్వీకరించే దమ్ముందా అని ట్విటర్ వేదికగా లోకేశ్ గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్‌కి స్పందించాల్సింది జగనే అని, నీ గేటు దగ్గర ఊరకుక్కలు కాదు అని నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదే లోకేశ్ గత సార్వత్రిక ఎన్నికల్లో రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే కాదు, రాజధాని ప్రాంతంలోని తాడికొండలో కూడా వైసీపీ అభ్యర్థి శ్రీదేవి గెలుపొందారు. మరి రాజధాని ఏర్పాటు చేశారనే సంతోషమే ఉంటే, ఆ ప్రాంతంలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారే జరుగుతాయి. ఏదైనా కారణంతో ఉప ఎన్నికలు జరగొచ్చు. ప్రజాభిప్రాయం తమకు అనుకూలమని తండ్రీకొడుకులైన బాబు, లోకేశ్ భావిస్తున్న నేపథ్యంలో తమ వాళ్లతో రాజీనామాలు చేయించాల్సిన బాధ్యత వాళ్లిద్దరిపైనే ఉంది.