ఒకట్రెండు నెలల్లో తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్న ఓ వ్యక్తికి బాగా భయం పట్టుకొంది. నిజానికి అతను సంతోషించాల్సిన సమయం, సందర్భం. మనిషి మంచివాడే. కాకపోతే ఓ చిన్న బలహీనత అతనిలో ఉంది. అలాగని ఆ బలహీనత అతనికి తప్ప ఇతరులకు కీడు చేసేదేమీ కాదు. అవసరం ఉన్నా లేకున్నా సరదాగా అబద్ధాలు చెబుతుంటాడు. తాను చెప్పేది అబద్ధాలని, ఎవరూ నమ్మరని అతనికీ తెలుసు. కానీ ఏం చేద్దాం…ఆ బలహీనతను అతను అధిగమించలేక పోతున్నాడు.
‘అయ్యా, బాబూ నువ్వు చెప్పే అబద్ధాల పుణ్యమా అని, ఒకవేళ నువ్వు నిజంగా నిజాలు చెప్పినా నమ్మరు’ అని శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు చాలా సార్లు చెప్పారు. ఆ క్షణం వరకు ‘ఇక అబద్ధాలు చెప్పను’ అని ‘ఊ’ కొడతాడు తప్ప…ఆ తర్వాత తన అలవాటునే ఫాలో అవుతాడు.
చిన్నప్పటి నుంచి అతనికి వేల సార్లు వందల మంది చెప్పినా భయపడని, మారని మనిషిలో ఇప్పుడు ఓ చిన్న ‘హెచ్చరిక ’ పశ్చాత్తాపం కలిగిస్తోంది. ‘నేను ఇక అబద్ధాలు చెప్పను ’ అని మనసు మౌనరోదన చేస్తోంది. అబద్ధాలు చెప్పడం మనోడితో ఎలాగైనా మాన్పించాలని ఆలోచించి…చించి…చించి…చివరికి ఓ ఎత్తుగడ వేశాడో మిత్రుడు.
ఒక శుభోదయాన ‘ఓరేయ్ నీకు మగపిల్లాడే పుడతాడు ’ అని అబద్ధాల మిత్రుడితో చెప్పాడా శ్రేయోభిలాషి.
మగపిల్లాడే అని నొక్కి చెప్పేసరికి సంతోషం పట్టలేక కడుపు ఉబ్బిందతనికి.
‘అంత కచ్చితంగా ఎలా చెబుతున్నావ్ ’ అని అబద్ధాల మిత్రుడు మరోసారి వారసుడి గురించి వినాలని రెట్టిస్తూ అడిగాడు.
‘చిన్నప్పటి నుంచి నువ్వు అబద్ధాలే కదా చెప్పేది’ అని శ్రేయోభిలాషి అన్నాడు.
అబద్ధాల మిత్రునికి ఏమీ అర్థం కాక ‘అబద్ధాలు చెబితే ఆడపిల్ల పుడుతుందని కదా మన పెద్దోళ్లు చెప్పింది’ అని ప్రశ్నించాడు.
‘అది మన పెద్దోళ్ల కాలం నాటి మాట’ అన్నాడా శ్రేయోభిలాషి.
‘అబ్బో ఇప్పుడేం మారిందో’ అని అబద్ధాల మిత్రుడు సమాధానం కోసం తహతహలాడుతూ ప్రశ్నించాడు.
‘ఇప్పుడు నారా చంద్రబాబు, లోకేశ్ లాంటి మహానుభావులు జీవిస్తున్న కాలం నాయనా’ అని అన్నాడు.
‘అంటే’ తలగోక్కుంటూ ప్రశ్నించాడు అబద్ధాల మిత్రుడు.
‘ఏం లేదు మిత్రమా , చంద్రబాబు అబద్ధాలు చెప్పడమే జీవితంగా, అవే తెలివితేటలని భ్రమించి, ఓ జీవన విధానంగా అలవాటు చేసుకున్నాడు. అచ్చం ఆయన్లా నువ్వు కూడా ఫాలో అయ్యావు’ అని ఆ శ్రేయోభిలాషి చెప్పాడు.
‘ నాకు కొడుకు పుట్టడానికి చంద్రబాబుకు సంబంధం ఏంటి’ అని అబద్ధాల మిత్రుడు కాస్త విసుగ్గా ప్రశ్నించాడు.
‘చంద్రబాబుకు పిల్లలు ఎంత మంది’ శ్రేయోభిలాషి ప్రశ్నించాడు.
‘లోకేశ్ ఒక్కడే కదా. ఇది అందరికి తెలిసిన విషయమే కదా’ అన్నాడా అబద్ధాల మిత్రుడు.
‘మరి మన పెద్దోళ్ల చెప్పినట్టు చంద్రబాబుకు ఆడపిల్ల లేదా అడపిల్లలు పుట్టాలి కదా. మరి లోకేశ్ ఎందుకు పుట్టాడంటావ్’ శ్రేయోభిలాషి మిత్రుడు ప్రశ్న వేశాడు.
‘అంటే ఏంటి నువ్వు చెప్పేది’ అబద్ధాల మిత్రుడి ప్రశ్న.
‘అంటే అబద్ధాలు చెప్పేవాళ్లకి లోకేశ్ లాంటి కొడుకులు పుడతారన్న మాట’ అని చివరికి అసలు విషయాన్ని తేల్చి చెప్పాడు శ్రేయోభిలాషి.
‘బాబోయ్, ఆ మాట మరోసారి అనద్దురా బాబు. పైన తథాస్తు దేవతలుంటారంటా. లోకేశ్ లాంటి కొడుకు పుడతాడని చెప్పేటప్పుడు దేవతలు ‘తథాస్తు’ అంటే నా జీవితం ఏం కావాలి. నాకే కాదు శత్రువులకు కూడా వద్దని ప్రార్థిస్తా. ఆ మాట వెనక్కి తీసుకో’ అని శ్రేయోభిలాషిని ప్రాథేయపడ్డాడా అబద్ధాల మిత్రుడు
అదన్న మాట అబద్ధాలాడితే లోకేశ్ పుడతాడనే కథ.