మండల పంచాయతీలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నిలపవలసిన బాధ్యతను తన మంత్రివర్గ సహచరుల మీద మోపుతున్నారు. జిల్లాల్లో మండల, పంచాయతీ ఎన్నికల గెలుపు పూచీ పూర్తిగా.. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులమీదనే ఉంటుందని జగన్ బాధ్యతలు అప్పజెప్పేశారు.
ఈ మేరకు జగన్ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో వారికి టైంటేబుల్ కూడా తానే సెట్ చేశారు. ఇప్పటినుంచి స్థానిక ఎన్నికల సమరం పూర్తయ్యేవరకు ఇన్చార్జి మంత్రులందరూ తమ తమ జిల్లాల్లోని వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండాలనేది నిర్దేశం. ఈమేరకు వారంలో నాలుగురోజుల పాటూ.. తమకు కేటాయించిన జిల్లాల్లో మాత్రమే ఉండాలని, మిగిలిన మూడు రోజులు తమ సొంత నియోజకవర్గాల పనులు చూసుకోవచ్చునని సెట్ చేశారు.
స్థానిక ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో, ఇన్చార్జి మంత్రులే లోకల్ ఎమ్మెల్యేలకు పూర్తి సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. తమది అధికారంలో ఉన్న పార్టీ గనుక.. పదవులు ఆశించే వారు ఎక్కువగా ఉంటారని, తత్కారణంగా అసంపృప్తులు కూడా పెద్దస్థాయిలో పెల్లుబుకుతుంటాయని.. జగన్ పూర్తి స్పృహతోనే ఉన్నారు. అందుకే.. నాయకులను బుజ్జగించే బాధ్యతలు మొత్తం ఇన్చార్జి మంత్రులే చూసుకోవాలని పేర్కొనడం గమనార్హం. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంటుందని, అక్కడి ఇబ్బందులను మంత్రులే చక్కబెట్టాలని సూచించారు.
మొత్తానికి ఒక విషయంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ బలహీనతను కూడా జగన్ ఈ సమీక్ష సమావేశంలో స్పష్టంగానే అంగీకరించినట్లు కనిపిస్తోంది. రాజధాని తరలింపునకు సంబంధించిన వివాదం రేగుతున్న సమయంలో.. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం తమకు ఇబ్బంది ఉండవచ్చునని.. అయినప్పటికీ ప్రజలంతా తమతోనే ఉన్నారని జాగ్రత్తగా ఇక్కడ ఎన్నికలను ఎదుర్కోవాలని జగన్ సూచించడం విశేషం. మొత్తానికి ఆరునెలలు దాటిన తన పాలనకు ప్రజల స్పందన ఏమిటో తెలియజెప్పే ఎన్నికలు గనుక.. జగన్ వీటిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.