హింసకోసం పవన్ ఉబలాటం!

అమరావతినుంచి రాజధానిని తరలించరాదంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు హింసాత్మకరూపు దిద్దుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఉబలాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మాటలు, ప్రకటనలు చూస్తోంటే.. రైతులు ఇంకా పెద్దస్థాయి విధ్వంసాలకు పాల్పడడం లేదని ఆవేదన చెందుతున్నట్లుంది.…

అమరావతినుంచి రాజధానిని తరలించరాదంటూ.. రైతులు చేస్తున్న దీక్షలు హింసాత్మకరూపు దిద్దుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఉబలాటపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన మాటలు, ప్రకటనలు చూస్తోంటే.. రైతులు ఇంకా పెద్దస్థాయి విధ్వంసాలకు పాల్పడడం లేదని ఆవేదన చెందుతున్నట్లుంది. రైతుల రూపేణా గానీ, వారి ముసుగులో రాజకీయ నాయకులు గానీ.. చేస్తున్న ఆందోళనలు శృతిమించకముందే పోలీసులు అణచివేస్తుండడాన్ని కూడా ఆయన సహించలేకపోతున్నట్లుగా ఉంది.

హీరో పవన్ కల్యాణ్‌కు ‘నేను లేస్తే మనిషిని కాను’ అని బెదిరించడం తొలినుంచి అలవాటే. నేను తలచుకుంటే ఏమవుతుందో తెలుసా? మీరెవ్వరూ మిగలరు? బయట తిరగలేరు? మీ అంతు చూస్తాం. తడాఖా చూపిస్తాం…! లాంటి ప్రగల్భాలు గతంలో ఆయన కొన్ని వందల సార్లు బీభత్సస్థాయిలో అనిఉన్నారు.  తాను తలచుకుంటే.. తన ప్రత్యర్థులందరూ మసి అయిపోతారన్నట్లుగా రంకెలు వేశారు. కానీ.. నిజ్జంగా పవన్ కల్యాణ్ తలచుకుంటే ఏం జరుగుతుందో.. ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు నిరూపించారు. అక్కడితో పవన్ ప్రగల్భాలు కాస్త తగ్గుతాయని ప్రజలు అనుకుంటే, ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు.

అమరావతికి సంబంధించి రాజధాని తరలింపు వివాదం రేకెత్తిన తొలినాటినుంచి పవన్ ఒకే ఆశతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన తొలిరోజు నుంచి.. ప్రజలు హింసకు తెగబడ్తారని, ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని ప్రజలకు సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. కానీ ఆయన కోరుకున్నట్లుగా జరిగినట్లు లేదు. ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వడం మినహా హింస పెట్రేగలేదు. చంద్రబాబును అరెస్టు చేయడం వల్ల.. హింస చెలరేగుతుందని… పవన్ కల్యాణ్ మళ్లీ తన కోరికను బయటపెడుతున్నారు.

పవన్ ను పోలీసులు అడ్డుకుంటే చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేయడం, చంద్రబాబును అరెస్టు చేస్తే.. పవన్ హింస గురించి మాట్లాడడం.. యిదంతా చూస్తోంటే.. ‘యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్’ సామెత గుర్తుకొస్తోంది. ఏ గొడవా జరగకపోతే.. ప్రభుత్వాన్ని నిందించడం ఎలా? అని పవన్ మధనపడుతున్నట్లుగా ఉంది గానీ.. ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో చాలా గట్టిగానే వ్యవహరిస్తోంది.