ఒక పాయింటు దొరికింది… దాన్ని పట్టుకుని… వీలైనంత రచ్చ రచ్చ చేసేయాలి. మొత్తం 13 జిల్లాల్లో కనీసం 29గ్రామాల్లోని కొన్ని వర్గాలకు ప్రజలు ఇన్నాళ్లకు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ మాత్రం చాలు.. దాన్ని పట్టుకుని వీలైనంత రాద్ధాంతం చేసేస్తే.. రాజకీయంగా లాభపడతాం.. అనేది మాత్రమే తెలుగుదేశం పార్టీ నేర్చుకున్న నీతిలాగా కనిపిస్తోంది.
ప్రతిరోజూ ఒక అరెస్టుతో హడావిడి చేస్తూ ఉంటే.. రాష్ట్రం మొత్తం జగన్ ప్రభుత్వం వైఫల్యాల కింద, దుర్మార్గాల కింద ప్రొజెక్టు చేయవచ్చుననే కుట్ర ఆలోచనలతో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
మొన్న నారా లోకేష్ అరెస్టు అయ్యాడు… నిన్న ఏకంగా నారా చంద్రబాబునాయుడే అరెస్టు అయ్యేదాకా పరిస్థితుల్ని తీసుకువచ్చాడు.. ఇవాళ ఆ వంతు ఆలపాటి రాజేంద్రపసాద్ ది! తమ నాయకులకు కొనసాగింపు అన్నట్లుగా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన అనుచరుల్ని వెంటబెట్టుకుని యాత్రలకు సిద్ధమయ్యారు.
పోలీసులు అరెస్టు చేయడానికి వస్తే.. అనుచరులంతా వారితో ఘర్షణకు దిగారు. తమ శక్తిమేర నచ్చజెప్పడానికి ప్రయత్నించిన పోలీసులు.. పాదయాత్రను మరికొంత దూరం కొనసాగనిచ్చిన తర్వాత.. ఆయనను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రోగి కోరుకున్నదే.. వైద్యుడు ప్రసాదించినట్లుగా తయారైంది.
అరెస్టు కావడమూ.. తద్వారా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకోవడం మాత్రమే వారికి కావాలి. అది జరిగిపోయింది.ఇక్కడ ఒక కామెడీని గమనించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ పోరాటాలకు సూత్రధారిగా వ్యవహరిస్తోంది. అయితే రాష్ట్రంలో ఏ ఇతర ప్రాంతంలో కూడా ఆ పార్టీ నాయకులు కూడా దీక్షలు గానీ పోరాటాలు గానీ చేయడం లేదు.
అమరావతి మాత్రమే రాజధానిగా కావాలనే ప్రతిపాదనకు అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు ఉన్నదని చెప్పదలచుకుంటే.. అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతాల్లో తమ పార్టీ నాయకులతో దీక్షలు చేయించవచ్చు కదా…! వారికి అది మాత్రం చేతకావడం లేదు. ఒక్క ఊరిలో కూర్చుని.. రగడ చేస్తూ.. రాష్ట్రం మొత్తం ప్రజల భావాలను ప్రతిబింబిస్తున్నట్లుగా బుకాయించడానికి వారు తెగబడుతుండడమే విశేషం. ఇలా రోజుకో అరెస్టు డ్రామాలతో వారు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.