జ‌గ‌న్ అనే మూర్ఖుడే లేకుంటే….?

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే వ్య‌క్తే లేక‌పోయి వుంటే కొన్ని నిప్పులాంటి నిజాలు ఎప్ప‌టికీ తెలిసేవి కావు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల డొల్ల‌త‌నం ఎప్ప‌టికీ తెలిసి వుండేది కాదు. వైఎస్ జ‌గ‌న్‌పై ప‌గ ప‌ట్టిన‌ట్టు…

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనే వ్య‌క్తే లేక‌పోయి వుంటే కొన్ని నిప్పులాంటి నిజాలు ఎప్ప‌టికీ తెలిసేవి కావు. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల డొల్ల‌త‌నం ఎప్ప‌టికీ తెలిసి వుండేది కాదు. వైఎస్ జ‌గ‌న్‌పై ప‌గ ప‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు గ‌త కొన్నేళ్లుగా యావ‌త్ స‌మాజం అంతా క‌ళ్ల‌ప్ప‌గించి ఆశ్చ‌ర్యంతో చూస్తూ ఉంది. దీనికి ప‌రాకాష్ట గ‌త రెండు మూడు రోజులుగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఉద‌హ‌రించుకోవ‌చ్చు. న్యాయం, చ‌ట్టం అంద‌రికీ స‌మాన‌మ‌నే సూక్తులు కేవ‌లం రాజ్యాంగానికి, పుస్త‌కాల‌కే ప‌రిమిత‌మ‌ని మ‌రోసారి రుజువైందని న్యాయ నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు, కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు, డ‌బ్బు ఇలా అనేక అంశాల ప్రాతిప‌దిక‌గా మ‌న దేశంలో రాజ్యాంగ వ్య‌వ స్థ‌లు ప‌నిచేస్తున్నాయ‌నేందుకు వైఎస్ జ‌గ‌న్‌పై కేసులు, విచార‌ణ‌లే నిలువెత్తు నిద‌ర్శ‌న‌మే అభిప్రాయాలు పౌర స‌మాజంలో బ‌లంగా ఉన్నాయి. కొన్ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు చెప్పేదొక‌టి, చేసేదొక‌టి అనే విమ‌ర్శ‌లు బ‌లంగా ఉన్నాయి. అందుకే చ‌ట్టం, న్యాయం లాంటి అంశాల‌పై ప్ర‌జ‌ల్లో భ్ర‌మ‌లు పోవ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు.

ఎంతో గొప్ప అశ‌యంతో రాజ్యాంగాన్ని మ‌హ‌నీయులు ర‌చించారు. కానీ దాన్ని అమ‌లు చేసే వ్య‌క్తుల సంకుచిత స్వ‌భావం, అశ్రిత ప‌క్ష‌పాతం వ‌ల్లే స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. అలాంటి వారి వ‌ల్లే రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డుతోంది. అలాంటి వారి చేష్ట‌ల వ‌ల్లే ప్ర‌జాకోర్టులో కొన్ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు దోషిగా నిల‌బ‌డాల్సిన దుస్థితి ఏర్ప‌డింది.

తాజాగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు న‌మోదైన కేసుల ఉప‌సంహ‌ర‌ణ‌పై వివాదం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. జ‌గ‌న్‌పై న‌మోదైన కేసుల‌ను మూసివేస్తూ ఆయా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను త‌ప్పు ప‌డుతూ సుమోటోగా హైకోర్టు విచార‌ణ జ‌రుపుతుండ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ క‌మిటీ నిర్ణ‌యం మేర‌కు హైకోర్టు సుమోటోగా విచార‌ణ చేప‌ట్టిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు పాల‌న‌లో ఇలాగే మూసివేత‌కు గురైన కేసులు తాజాగా తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబు పాల‌న‌లో హత్యాయత్నం, అత్యాచారయత్నం, దాడులు, బెదిరింపులు తదిత‌ర కేసుల్లో పిటిషన్లను ఉపసంహరించుకున్న విష‌యం ఇప్పుడు వెలుగు చూసింది. మరికొన్ని కేసుల్లో ఏకంగా విచారణను మూసి వేసిన విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. దీనికి కార‌ణం , ఈ కేసుల్లో నిందితులుగా  చంద్రబాబు బావమరిది, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, అప్పటి  మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌రావుతో సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నార‌నే సంగ‌తులు ఇప్పుడు బ‌య‌టికొచ్చాయి.  

ఏకంగా 28 కేసుల్లో 28 అభియోగాలపై విచారణను ఉపసంహరిస్తూ టీడీపీ ప్రభుత్వం 21 జీవోలు జారీ చేయండ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మరో 131 కేసుల్లో అస‌లు విచారణే అవసరం లేదని అర్ధంతరంగా మూసి వేశారు. అలాగే 2012లో ఆళ్ల‌గ‌డ్డ ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘించార‌ని కోర్టు ఉత్త‌ర్వుల‌తో కేసు న‌మోదైంది. 2017లో బాబు సీఎంగా ఉండ‌గా ఈ కేసు విచార‌ణ‌ను అర్ధంతరంగా నిలిపివేశారు.

మ‌రి అప్ప‌ట్లో ప‌దుల సంఖ్య‌లో టీడీపీ ముఖ్య‌నేత‌ల‌పై కేసుల మూసివేత‌, విచార‌ణ నిలిపివేత‌పై ఎందుక‌ని రాజ్యాంగ వ్య‌వ‌స్థ స్పందించ‌లేద‌నేదే ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. జ‌గ‌న్‌పై సుమోటోగా కేసు విచార‌ణ చేప‌ట్ట‌డంలో ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల‌కు అభ్యంత‌రం ఉండాల్సిన అవ‌స‌రం అస‌లే లేదు. కానీ ప్ర‌శ్న‌ల్లా ఒక‌టే… జ‌గ‌న్ విష‌యంలో ఒక‌లా, అదే చంద్ర‌బాబుకైతే మ‌రోలా రాజ్యాంగ వ్య‌వ‌స్థ ఎందుకు ప‌నిచేస్తోంద‌ని? ఇది చాలా న్యాయ‌మైన ప్ర‌శ్నే.

వైఎస్ జ‌గ‌న్ వ‌ల్ల భావి త‌రాల‌కు క‌లిగే అతి పెద్ద ప్ర‌యోజ‌నం ఒకే ఒక్క‌టి ఉంది. కార‌ణాలేవైనా వైఎస్ జ‌గ‌న్ కొన్ని వ్య‌వ‌స్థ‌ల‌తో పోరాడుతున్నారు. భ‌య‌భ‌క్తుల‌తో న‌క్క విన‌యాలు ప్ర‌ద‌ర్శించే వ్య‌వ‌స్థ‌ల‌తో జ‌గ‌న్ ఢీకుంటున్నారు. దీంతో జ‌గ‌న్‌పై క‌క్ష క‌ట్టిన‌ట్టు కొంద‌రు ప‌ని చేస్తున్నారు. అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ‌తో ముఖ్య‌మంత్రి అయిన వైఎస్ జ‌గ‌న్‌కు చాలా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని తీవ్ర‌మైన ఇబ్బందులు కూడా ఎదుర‌వుతాయి.

ప్ర‌స్తుతం తానొక్క‌డూ క‌ష్టాలు ఎదుర్కొంటూ, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల ప‌క్ష‌పాత వైఖ‌రిని, వాటి నియంతృత్వాన్ని దిగంబ‌రంగా నిల‌బెడుతున్న వైఎస్ జ‌గన్‌కే ద‌క్కుతుంది. భావి త‌రాల‌కు జ‌గ‌న్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే. ఎందుకంటే ఫ‌లానా వ్య‌క్తి పాల‌న‌లో… కొన్ని వ్య‌వ‌స్థ‌లు ఇంత దుర్మార్గంగా ప‌ని చేశాయ‌ని భావి త‌రాలు చెప్పుకునే ఓ రోజు త‌ప్ప‌క వ‌స్తుంది. చ‌రిత్ర‌లో జ‌గ‌న్ పాల‌న‌ను ఆ కోణంలో కూడా ఎప్ప‌టికీ స్మ‌రించుకుంటారు. జ‌గ‌న్‌కు ఎదురైన చేదు అనుభ‌వాలు రానున్న రోజుల్లో త‌ప్ప‌కుండా వ్య‌వ‌స్థ‌ల్లో మార్పున‌కు శ్రీ‌కారం చుట్టేలా చేస్తాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

కొన్ని వ్య‌వ‌స్థ‌లను అడ్డు పెట్టుకుని కొంత మంది విజ‌యం సాధించామ‌ని తాత్కాలికంగా సంబ‌ర‌ప‌డొచ్చు. కానీ ప‌డ్డ‌వాళ్లెప్పుడూ చెడ్డ‌వాళ్లు కారని గుర్తించు కావాలి! రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లోని కొంత మంది స్వార్థ‌ప‌రులు, అవ‌కాశ‌వాదుల నిజ స్వ‌రూపాన్ని న‌డి బ‌జారులో పెట్ట‌డానికి జ‌గ‌న్ మొండిత‌నం ప‌నికొస్తోంది. జ‌గ‌న్ మొండి త‌నం కొంద‌రి దృష్టిలో మూర్ఖ‌త్వంగానూ, అవివేకిగానూ క‌నిపిస్తూ వుండొచ్చు. కానీ ఆ మూర్ఖ‌త్వ‌మే భావిత‌రాల‌కు కొన్ని నిష్టుర స‌త్యాల‌ను తెలియ‌జేయడానికి ప‌నికొస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.