సీత‌క్క క‌న్నీటి ప‌ర్యంతం

మావోయిస్టు అగ్ర‌నేత మృతితో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. గ‌తంలో ఆమె మావోయిస్టుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గెరిల్లా యుద్ధ‌తంత్రంలో ఆరితేరిన ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు యాప…

మావోయిస్టు అగ్ర‌నేత మృతితో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. గ‌తంలో ఆమె మావోయిస్టుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గెరిల్లా యుద్ధ‌తంత్రంలో ఆరితేరిన ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు యాప నారాయ‌ణ (50) అలియాస్ హ‌రిభూష‌ణ్ అలియాస్ జ‌గ‌న్ మృతితో ఆమె త‌ల్ల‌డిల్లారు. మావోయిస్టు అగ్ర‌నేత హ‌రిభూష‌ణ్ క‌రోనాతో సోమ‌వారం మ‌ర‌ణించిన‌ట్టు ఆ పార్టీ ప్ర‌క‌టించింది.

మావోయిస్టుల‌పై క‌రోనా పంజా విసిరింది. హ‌రిభూష‌ణ్‌తో పాటు మ‌రో కీల‌క నాయ‌కురాలు ఇంద్రావ‌తి ఏరియా క‌మిటీ స‌భ్యురాలు సిద్దిబోయిన సారక్క అలియాస్ భార‌త‌క్క కూడా క‌రోనాకు బ‌లైంది. ఇదిలా ఉండ‌గా ములుగు ఎమ్మెల్యే సీత‌క్క మావోయిస్టు అగ్ర‌నేత మృతి వార్త తెలియ‌గానే ఆయ‌న స్వ‌గ్రామానికి క‌దిలారు. 

మ‌హ‌బూబాబాద్ జిల్లా గంగారం మండ‌లం మ‌డ‌గూడెంలోని హ‌రిభూష‌ణం ఇంటికి సీతక్క వెళ్లి కుటుంబ స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. సీత‌క్క‌ను చూడ‌గానే కుటుంబ స‌భ్యులంతా ఒక్క‌సారిగా తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఆమెపై పడి రోదించడంతో సీతక్క తీవ్ర ఉద్వేగానికి లోన‌య్యారు. 

క‌న్నీళ్లు పెట్టుకుంటూ కుటుంబ స‌భ్యుల్ని ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా హ‌రిభూష‌ణ్‌తో త‌న జ్ఞాప కాల‌ను నెమ‌రు వేసుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో ఆయన టీం లీడరుగా ఉన్నప్పుడు తానూ ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పని చేశానని సీత‌క్క  గుర్తు చేసుకున్నారు.