కోవాగ్జిన్ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి మార్గం ఏర్పడుతుంది.
ఇదిలా ఉండగా ఏపీలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, సరఫరా లేకపోవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టలేకపోతున్న విషయమై ఈ నెల 11న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ సందర్భంగా కోవిడ్ కట్టడికి ముఖ్యమంత్రి కొన్ని కీలక సూచనల చేశారు.
కోవిడ్–19ను కట్టడి చేయాలంటే అర్హులందరికీ వేగంగా వ్యాక్సిన్ వేయడం ఒక్కటే ఏకైక మార్గమని తేల్చి చెప్పారు. అందువల్ల వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడం తప్ప మరోమార్గం లేదని ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ ఫార్ములా, టెక్నా లజీ బదిలీని ఇతర కంపెనీలకు ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో వైఎస్ జగన్ కోరిన సంగతి తెలిసిందే.
జగన్ తర్వాత ఇదే విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కేంద్రప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ జగన్ సూచించిన ప్రకారం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు అంగీకరించడంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీసింది.
ఒకవేళ ఇదే లేఖను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాసి ఉంటే …ఈ పాటికి తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశ వ్యాప్తంగా ఆయన పేరు మార్మోగి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ కోవ్యాగ్జిన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ ఫార్మా ఇండస్ట్రీ చంద్రబాబు రాజగురువు రామోజీరావు సమీప బంధువులదనే విషయం తెలిసిందే.
కోవ్యాగ్జిన్ టెక్నాలజీని బాబు సలహాతో ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు నిర్ణయించడం, దీంతో సులభంగా కరోనాను కట్టడి చేసే ఖ్యాతి చంద్రబాబుదే అని ఎల్లో మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు రాసి పడేసేది. అలాగే తమ చానళ్లలో 24 గంటలూ చర్చాగోష్టులు నిర్వహించి, ఇలాంటి నాయకుడిని ఎన్నుకోకపోవడం ఆంధ్రా ప్రజానీకం అజ్ఞానం అని తేల్చి పడేసేవి. చంద్రబాబు పుట్టిన తర్వాతే మేథస్సు పుట్టిందని నిర్ధారించేవాళ్లనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాబు అంటే విజనరీ; విజనరీ అంటే బాబు అని మరోసారి ప్రధానికి లేఖతో రుజువైందని హోరెత్తించేవాళ్లు. బాబు ముందు చూపుతేనే ఈ వేళ దేశం గర్వంగా తలెత్తుకుని నిలబడే అవకాశం దక్కిందనే వేనోళ్ల పొగిడేవాళ్లు. ఇక వారాంతపు పలుకుల సార్ రాయడానికి పేజీలు సరిపోయేవి కావు.
నియోజక వర్గానికి నాలుగైదు వేలు ఓట్లున్న వీకే, రాష్ట్రం కోసం, దేశం కోసం చానళ్లు మారే మూర్తిలాంటి బాబు భక్తులు మరి కాస్తా ముందుకెళ్లి …అసలు కోవ్యాగ్జిన్ను కనుగొన్నదే తమ ఆరాధ్య నాయకుడని తేల్చి చెప్పేవాళ్లు. ఏపీ ప్రజల అదృష్టం, ఎల్లో బ్యాచ్ దురదృష్టమో తెలియదు కానీ, ప్రధానికి బాబు లేఖ రాయకపోవడంతో మనం బతికిపోయాం.