కోవిషీల్డ్ కోవిడ్ టీకా రెండు డోస్‌ల మధ్య కాల వ్యవధిని పెంచుతూ కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో డోస్‌పై మోదీ సర్కార్ చేతులెత్తేసిందనే విమర్శలు చెలరేగుతున్నాయి.
సమయానికి వ్యాక్సిన్ ఇవ్వలేక, తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వం గడువు పేరుతో నాటకాలాడుతోందని సోషల్ మీడియా, పౌర సమాజం కోడై కూస్తోంది. మోదీ అసమర్థత పాలనను కరోనా మహమ్మారి దిగంబరంగా నిలబెడుతోందని, దానికి కోవిషీల్డ్ రెండో డోస్‌పై రోజుకో విధంగా మాట మార్చడమే నిలువెత్తు నిదర్శనమని చెబుతున్నారు. అయితే ఈ కాల వ్యవధి గడువు కోవాగ్జిన్‌కు మాత్రం వర్తించదని చెప్పడం గమనార్హం.
మొదట కోవిషీల్డ్ టీకా రెండు డోస్ తీసుకునేందుకు 28 రోజుల కాలవ్యవధిని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఆ తర్వాత కోవిషీల్డ్ టీకాల డోస్‌ల మధ్య వ్యవధిని పెంచుతూ 6-8 వారాలుగా మారుస్తూ మార్చి నెలలో నిర్ణయించారు. ఆ తర్వాత తాజాగా 12-16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ) చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తరచూ కాల వ్యవధి గడువు మార్పుపై విమర్శలు చెలరేగడంతో కేంద్ర ఆరోగ్యశాఖ సరికొత్త వాదన తెరమీదకి తెచ్చింది. రెండు టీకాల మధ్య కాల పరిమితిని పెంచితే చాలా ప్రయోజనాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ విషయం బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైనట్టు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది.
మొదటి టీకా తీసుకున్నాక ఆరు వారాలలోపు రెండో టీకా తీసుకుంటే వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం 55.1% ఉండగా, రెండో డోస్‌కు 12 వారాల కంటే ఆలస్యంగా తీసుకుంటే టీకా సామర్థ్యం ఏకంగా 81.3% పెరిగినట్టు బ్రిటన్ అధ్యయనంలో తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసే మాటలు చెబుతున్నా…జనం విశ్వసనీయత మాత్రం కోల్పోయిందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం రెండో డోస్ వ్యాక్సిన్‌ను గడువు లోపు ఇవ్వలేకే ఈ పాట్లన్నీ అని విమర్శిస్తున్నారు. ఇంత కాలం 28 రోజులు, ఆ తర్వాత 6-8 వారాల గడువుకు సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయకుండానే చెప్పారా? అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
కోవిడ్‌ను కట్టడి చేయడంలో విఫలమై ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటూ మోదీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న సం గతి తెలిసిందే. ప్రపంచంలోనే మొట్టమొదట కోవిడ్ వ్యాక్సిన్‌ను తమ దేశంలోనే తయారు చేశామని గొప్పలు చెప్పుకుని, చివరికి స్వదేశీయులకు వేయకుండా కరోనా సెకెండ్ వేవ్‌కు బలిస్తున్నారనే ఆరోపణలు చుట్టుముట్టాయి.
ఈ నేపథ్యంలో రెండో డోస్‌ను ఇవ్వలేకే గడువు పేరుతో మోదీ సర్కార్ విన్యాసాలు చేస్తోందని జనం మండిపడుతున్నారు. రెండో డోస్‌పై కూడా జనం ఆశలు వదులుకునేలా కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఉందంటున్నారు.