పరస్పర అవసరాల మీద సాగుతున్న ప్రయాణాలు ప్రస్తుత జీవితాలు. లైఫ్, కెరీర్.. ఇలా ఎలా చూసుకున్నా.. మనకు నచ్చినా, నచ్చని వారితో కలిసి పని చేయాలి, ప్రయాణం సాగించాలి. నచ్చిన వారితోనూ ఇబ్బందులు తలెత్తక మానవు, నచ్చని వారితోనూ కలిసి పని చేయక తప్పదు. ఇలాంటి సమయంలో ఎన్నో ఎమోషన్స్ కుదిపేస్తాయి.
ఎమోషనల్ గా ఉండటం మంచిదే, అయితే ఎమోషనల్ ఫూల్ గా ఉండటం మాత్రం పెద్ద బలహీనత. వాడుకుని వదిలేసే రకాలను డీల్ చేయాలి, చనువుగా ఉండే వారితోనూ ఎమోషన్లను బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి ఇదంతా జరగాలంటే.. మీరు పర్సనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. అనునిత్యం ఎదురయ్యే పరిస్థితులకు తగ్గట్టుగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి.
అలా ఉండాలంటే.. మీ జీవితంలో మీరు కొన్ని స్థిరమైన లక్ష్యాలనూ, భావనలనూ, ఒక స్థిరమైన జీవన శైలిని కలిగి ఉండాలంటున్నారు మానసిక విశ్లేషకులు. ఈ ధృఢ చిత్తాలను కలిగిన వారిని బయటి ప్రపంచం అంత తేలికగా ఇబ్బందికి గురి చేయలేదని వారు చెబుతున్నారు. మరి అలా ఉండాలంటే..
న్యూ గోల్స్ ను సెట్ చేసుకోవడం!
ఎప్పటికప్పుడు న్యూ గోల్స్ ను సెట్ చేసుకుంటూ వాటి గురించి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ తో ముందుకు వెళుతూ ఉంటే, దైనందిన జీవితంలో ఎదురయ్యే కొన్ని రకాల సెట్ బ్యాక్స్ పెద్ద ఇబ్బంది పెట్టవు. ప్రత్యేకించి ప్రస్తుత వాతారణంలో ఇబ్బంది పెట్టే వ్యక్తులు, ఎమోషన్లను మనల్ని ఎక్కువగా కుదిపేయకుండా ఉండటానికి మనకున్న సెట్ ఆఫ్ గోల్స్ చాలా ఉపకరిస్తాయి.
ఎప్పుడైతే పూర్తిగా వర్తమానంతోనే ముడిపడిపోతామో.. అప్పుడు ఇతరులు మనపై రుద్దే నెగిటివిటీకి తీవ్ర ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఇది దిగులుగా మారొచ్చు. మరో రకంగా ఇబ్బంది పెట్టొచ్చు. ఇలాంటి పరిణామాలు మనల్ని తీవ్రంగా ప్రభావితం చేయకూడదనుకుంటే.. వేర్వేరు గోల్స్ ను పెట్టుకుని, వాటి గురించి కసరత్తులను సాగించడం బెస్ట్ పాలసీ.
పాత అలవాట్లను వదిలించుకోవడం!
మనకున్న అలవాట్లే మనకు ఇతరుల నుంచి కూడా కొన్ని సార్లు ఇబ్బందులు తెచ్చి పెట్టవచ్చు. అలాంటప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడం కూడా మంచిదే. ప్రత్యేకించి వర్క్ లైఫ్ విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ కొన్ని పాత అలవాట్లను వదిలించుకుంటే మంచిది. ఈ అలవాట్లే మనల్ని వెనక్కు లాగుతున్నాయని అనిపించిన వాటి నుంచి బయటకు వస్తే చాలా మేలు జరుగుతుంది.
మెంటల్ గా స్ట్రాంగ్ ఉండగలగడం!
మానసికంగా ధృఢంగా ఉండటం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ప్రత్యేకించి మన చుట్టూరా ఉండే, మనతో కలిసి పని చేసే వ్యక్తుల నుంచినో, లేక పై స్థాయివారి నుంచినో.. వ్యత్తిగత జీవితాల్లో ఎదురయ్యే హెచ్చుతగ్గులను ఎదుర్కొనడానికి మానసికంగా బలంగా ఉండాల్సిందే. మరి మానసికంగా బలంగా ఉండాలంటే.. ఏం చేయాలంటే, ఆనందంగా ఉండటం నేర్చుకుని ఉండాలంటారు పరిశోధకులు. ఆనందంగా ఉండటం ఎలాగో తెలిసిన వారికి మానసిక బలంగా అదే చేకూరుతుందంటారు.
రిస్క్ తీసుకునే సత్తా ఉండాలి!
రిస్క్ తీసుకునే సత్తా ఉండే వారి జీవితం ముందుకు కదులుతుంది. కంఫర్ట్ జోన్ ను వెదుక్కొని, అక్కడకు పరిమితం అయితే.. మానసికంగా చాలా ఇబ్బందులకు గురి కావాల్సి రావొచ్చు. మీకు మీరే చాలెంజ్ విసురుకుంటే, ఆ తరహా రిస్క్ తీసుకుంటే.. చాలా శషభిషలకు దూరం కావొచ్చు. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఎంతసేపూ.. అవసరమైన, అనవసరమైన ఆందోళన ఉంటుంది. అదే రిస్క్ చేసి, అందుకు అనుగుణంగా పని చేస్తూ పోతే..మీ జీవన ప్రమాణాలే మెరుగుపడతాయి!
వ్యాయామం చేయాలి!
రోజువారీ జీవితంలో ఎదురయ్యే యాంగ్జైటీలను నిరోధించడానికి వ్యాయామం కూడా ఒక మంచి మార్గం. రోజువారీగా లేదా వారానికి ఒకసారి అయినా వర్కవుట్ చేయడం స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించడమే కాదు, మానసికంగా ఉల్లాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. డిప్రెషన్ తరహా ఇబ్బంది పడే వారికి కూడా వ్యాయామం ఒక చక్కటి మందు!