సినిమా వాళ్ల విడాకుల పరంపర కొనసాగుతూ ఉంది. ఏ తరానికి ఆ తరం అన్నట్టుగా.. సినీ తారల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత కొన్నాళ్లకో, కొన్నేళ్లకో విడాకులు తీసుకునే వారి తీరు కొనసాగింపుగా మారింది. ఈ మధ్యకాలంలో వరసగా సినీ సెలబ్రిటీ కపుల్ విడాకుల వార్తల్లో నిలవడం గమనార్హం.
నాగచైతన్య, సమంత వంటి స్టార్ కపుల్ విడాకులు తీసుకున్న తర్వాత ధనుష్, ఐశ్వర్యల విడాకులు అంతే స్థాయి సంచలనం అయ్యాయి. నాగచైతన్య, సమంతలు తక్కువ సంవత్సరాల్లోనే విడాకుల బాట పట్టగా, ధనుష్ , ఐశ్వర్యలు పద్దెనిమిదేళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ జంటలకు కొన్నాళ్ల ముందు బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, కిరణ్ రావుల విడాకుల అంశం వార్తల్లో నిలిచింది.
గమనిస్తే.. వీళ్లంతా వేర్వేరు వయసుల వాళ్లు. ఆమిర్ కు యాభై దాటేసి ఉంటాయి. నలభైల్లో ఉన్న ధనుష్, ఐశ్వర్య. అంతకన్నా చిన్న వయసు వారు సమంత, నాగచైతన్య. సినిమా వాళ్లలో వైవాహికబంధం తెంపుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు అనే విషయం వీరి తీరును గమనించి అర్థం చేసుకోవాలేమో.
వీరిలో ఆమిర్ ఖాన్ కు అదేమీ మొదటి పెళ్లి కూడా కాదు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా… కూడా విడాకులకు సినిమా వాళ్లు వెనుకాడరనే విషయం కూడా ఇలా తేటతెల్లం అవుతుంది. ఒకసారి, రెండు సార్లు కూడా విడాకులు తీసుకుని.. మూడో వివాహాలను చేసుకున్న సినిమా వాళ్ల జాబితాను తయారు చేసినా అది చాలా పెద్దదే అవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఎటు చూసినా ఇలాంటి స్టార్లు చాలా మంది ఉన్నారు. మరి ఇందుమూలంగా ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది.
సినిమా వాళ్ల కాపురాలంటే ఇలానే ఉంటాయని ప్రజలు అనుకుంటుంటారు గట్టిగా. సినిమా వాళ్లంటే ఇంతే.. అనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. అలాగని సినిమా వాళ్లే విడాకులు తీసుకుంటున్నారని కాదు. దేశం మొత్తం చూసుకున్నా.. ఆ ఈ తరంలో విడాకుల నిష్పత్తి కాస్త పెరిగే ఉండొచ్చు. సర్దుకుపోయే తత్వం ఉందా లేదా అనే సంగతెలా ఉన్నా.. ఎందుకు సర్దుకుపోవాలన్న ప్రశ్నే! విడాకులకు ప్రధాన కారణం కావొచ్చు.
సినిమా వాళ్ల వరకూ చూస్తే.. ఇద్దరికీ ఆర్థికంగా శక్తి సామార్థ్యాలు, సంపాదించగల అవకాశాలు ఉండటాన్ని గమనించవచ్చు. భారీ బ్యాక్ గ్రౌండ్ లేదా సొంతంగా స్టార్ డమ్ .. ఎలాగైతేనేం, సంపాదనకు మంచి మార్గాలున్న వారే ధైర్యంగా విడాకుల నిర్ణయాలను కూడా తీసుకుంటారేమో అనిపించవచ్చు.
సామాన్యుల్లో కూడా స్త్రీ, పరుషులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడూ, ఇద్దరిలో ఎవరికి వారికి సొంత సామర్థ్యం పై సోలోగా కూడా బతుకీడ్చగలమనే తత్వం ఉన్నప్పుడే విడాకులకు ఎక్కువగా అవకాశాలు ఉండవచ్చు. ఎవరో ఒకరు మరొకరిపై ఆధారపడే తత్వం ఉన్నప్పుడు, ఇద్దరూ ఒకర్నొకరు వివాహం తర్వాత కూడా అంతే ప్రేమతో ఉండగలిగినప్పుడు, లేదా ఇద్దరూ సర్దుకుపోయే తత్వం ఉన్నప్పుడు.. కుటుంబానికో, సమాజానికో విలువను ఇస్తున్నప్పుడే కాపురాలు ఎంతో కొంత సవ్యంగా సాగుతున్నాయి.
ఇండియాలో ఈ తరహా వ్యక్తుల జనాభా కోట్లలో ఉంటుంది కాబట్టి, విడాకుల రేటు ఇంకా తక్కువగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఇలానే ఉంటుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలుస్తోంది!
దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. యువతరం స్వేచ్ఛా జీవనాన్ని కోరుకుంటూ ఉంది. రాజీ పడి బతికేయడం కొత్త తరానికి అలవాటవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ స్వేచ్ఛకు వివాహం అడ్డుగా మారుతుందనే పరిస్థితి వస్తే.. పాశ్చాత్య దేశాల వలే ఇండియాలో కూడా విడాకుల రేటు పెరిగినా పెరగవచ్చు. అలాగని అదేమీ దారుణమైన సామాజిక పరిస్థితి కాదు.
వైవాహిక బంధానికి మరీ విపరీతమైన విలువ ఇవ్వని దేశాలు కూడా అన్ని రకాలుగానూ ప్రగతి బాటనే పయనిస్తూ ఉన్నాయి. సింగిల్ పేరెంట్ చైల్డ్ ఎక్కువగా ఉన్న దేశాలేమీ.. నాశనం అయిపోవడం లేదు. సింగిల్ పేరెంట్ శిక్షణలో పెరిగిన వారు, తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నాకా.. వారు వేరే పెళ్లిళ్లు చేసుకున్నాకా.. వారితో కలిసి జీవించిన వారు పాశ్చాత్య దేశాల్లో అద్భుతాలను ఆవిష్కరించడం చూస్తున్నాం.
ఇలాంటి కేసుల్లో కొన్ని సార్లు సవతి తల్లి, లేదా సవతి తండ్రి వేధింపులకు గురయ్యామని పాశ్చాత్యుల్లో కొందరు చెబుతూ ఉంటారు. ఈ తరహా వేధింపులు మాత్రం వారి జీవితాలను అతలాకుతలం చేయవచ్చు.
మరి ఇప్పుడు ఇండియాలో కూడా మారు మనువు సంతానాల పరిస్థితి చర్చలో ఉంటోంది. విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు తమ మాజీ భర్త లేదా భార్యతో సంక్రమించిన సంతానంతో కలిసి ఉంటున్నట్టుగా ప్రకటించుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలుగా వేరైనా, తల్లిదండ్రులుగా తాము కలిసే ఉన్నామంటూ వారు ప్రకటించుకుంటూ ఉన్నారు.
ఇలాంటి జంటలకు చెందిన పిల్లలు తమ తల్లిదండ్రుల తీరును ఎంత వరకూ యాక్సెప్ట్ చేస్తారో కానీ, తిరుగుబాటు ధోరణి అయితే బయటకు అంత కనిపించదు. సవతితల్లిని ద్వేషించినట్టుగా తండ్రిని ద్వేషించరని అనేక ఉదంతాలు చాటుతున్నాయి. మరోవైపు ఇండియాలో పెరుగుతున్న సహజీవనం కల్చర్ కూడా యువత ఆలోచనా ధోరణిని మారుస్తుందేమో!