క్వశ్చన్ మార్క్: ఫిబ్రవరి-1కి జీతాలు పడతాయా..పడవా?

కొత్త పీఆర్సీ ఒప్పుకుంటేనే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి-1న జీతాలు పడతాయి, లేకపోతే ఆలస్యం అవుతాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లి ఒత్తిడి తేవాలంటే ఫిబ్రవరి7 నుంచి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈలోగా ఫిబ్రవరి 1న…

కొత్త పీఆర్సీ ఒప్పుకుంటేనే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి-1న జీతాలు పడతాయి, లేకపోతే ఆలస్యం అవుతాయి. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లి ఒత్తిడి తేవాలంటే ఫిబ్రవరి7 నుంచి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈలోగా ఫిబ్రవరి 1న జీతాలు పడకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఉద్యోగ సంఘాల నాయకులకు, ఆర్థికంగా స్థితిమంతులైన కొంతమందికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇంటి అద్దెలు, ఈఎంఐలపై ఆధారపడే సగటు ఉద్యోగికి మాత్రం ఒకటో తేదీ జీతం పడకపోతే కష్టమే. ఆలోపు సంఘాలు మెత్తబడతాయా..? జీతాల కోసం ఏం చేస్తాయి..? జీతాలు పడకపోతే అది ఎవరి తప్పు..? ఉద్యోగుల గ్రూపుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.

అమ్మో ఒకటో తారీఖు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఒకటో తేదీ జీతం వస్తుందా రాదా అనేది నిన్నటి వరకూ ఒక సెటైర్ మాత్రమే. కానీ ఇప్పుడది నిజమైపోతోంది. కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక కాదు, ఉద్యోగుల మొండి వైఖరి వల్ల. అవును, ఫిబ్రవరి 1న ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడకపోతే దానికి ప్రభుత్వం తప్పు ఎంతమాత్రం లేదు, గొంతెమ్మ కోర్కెలతో రోడ్డెక్కిన ఉద్యోగులదే తప్పవుతుంది.

ఆ లోపు మెత్తబడతారా..?

సరిగ్గా వారం టైమ్ ఉంది. అయితే హడావిడిగా చివరిలో జీతాలు ప్రాసెస్ చేయడం కుదరదు. ఈలోపు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు పెడతారా, పాతవాటి ప్రకారం పెడతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటి వరకైతే ట్రెజరీ ఉద్యోగులు సహాయ నిరాకరణకే సై అంటున్నారు. మరి జీతాలు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

సమ్మె చేస్తామంటున్న ఉద్యోగులు ఫిబ్రవరి 7నుంచి తమ సత్తా చూపిస్తామంటున్నారు కానీ, మధ్యలో ఒకటో తేదీ వచ్చే సరికి ఇరుకునపడిపోయారు. ఆర్థిక ఇబ్బందులున్నవారికి, ఈఎంఐలు తరుముకొస్తున్నవారికి మిగతావారు సర్దుబాటు చేయగలరా..? మొత్తంగా ఉద్యోగులందరికీ జీతాలు పడకపోతే నగదు అందుబాటు కూడా తగ్గిపోతుంది. దీంతో సహజంగానే ఇప్పుడిదో పెద్ద ఆర్థిక సమస్యగా మారిపోయింది. ఉద్యోగుల వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.

ఇప్పటినుంచే కొంతమంది ఉద్యోగులు బ్యాంకు ఖాతాల్లో నగదు ఉండేలా సిద్ధం చేసుకుంటున్నారు. ముందుగానే చేబదులు తీసుకుని ఈఎంఐలకు సరిపోను బ్యాంకుల్లో ఉంచుకుంటున్నారు. మరికొంతమంది ఉద్యోగులు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తాత్కాలికంగా డబ్బు సమకూర్చి పెట్టుకుంటున్నారు. ఎక్కువమంది ఉద్యోగులు తమ ఆర్డీ, ఎఫ్ డీ ఖాతాల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. మరికొంతమంది వచ్చే నెలకు చిట్టీలు పాడేసుకుంటున్నారు.

మంత్రుల కమిటీని గుర్తిస్తారా లేదా..?

సీఎం జగన్ మంత్రులతో కమిటీ వేశారు కానీ.. ఆ కమిటీ ఉద్యోగులతో ఇంకా చర్చలు జరపలేదు, వారిని చర్చలకు పిలవలేదు. ఈరోజు పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ పిలిచినా వారు వస్తారన్న గ్యారెంటీ లేదు. ఈ దశలో అసలీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది, ఎలా కొలిక్కి వస్తుందనేది ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.