లెక్కప్రకారం వచ్చేనెల 7 నుంచి సమ్మెకు దిగుతారు ఉద్యోగులు. కానీ దాని ప్రభావం మాత్రం ఇవాళ్టి నుంచే మొదలుకాబోతోంది. ఈరోజు నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వివరించబోతున్నారు.
పేరుకు ఇది రౌండ్ టేబుల్ సమావేశం అయినప్పటికీ, వ్యవహారం ఇక్కడితో ఆగేలా లేదు. ఉద్యోగులంతా ప్రజల మధ్యలోకి వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోబోతున్నారు. ఆ కార్యక్రమం ఇవాళ్టి నుంచే షురూ కాబోతోంది. ఇక రేపు చీఫ్ సెక్రటరీని కలిసి నోటీసులు ఇవ్వబోతున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా చురుగ్గా స్పందిస్తోంది. ఉద్యోగుల్ని బుజ్జగించే కార్యక్రమాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభిస్తోంది. ఉద్యోగుల అభిప్రాయాన్ని కనుక్కునేందుకు ముఖ్యమంత్రి జగన్, సంప్రదింపుల కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. మంత్రులు బొత్స, పేర్ని నాని, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు చీఫ్ సెక్రటరీ కూడా ఈ కమిటీలో ఉన్నారు.
ఈ కమిటీ ఇవాళ్టి నుంచే తమ పని ప్రారంభించబోతోంది. మరీ ముఖ్యంగా దీన్ని సంప్రదింపుల కమిటీ అనే కంటే బుజ్జగింపుల కమిటీ అనడం కరెక్ట్. టాస్క్ మాస్టర్ సజ్జల ఎంట్రీతో ఈ కమిటీకి వెయిట్ పెరిగింది. మంత్రులున్నప్పటికీ అన్నితానై సజ్జల ఈ బుజ్జలగింపుల పర్వాన్ని ప్రారంభించబోతున్నారు. ఈరోజే కొంతమంది ఉద్యోగ సంఘాల్ని చర్చలకు పిలిచే అవకాశం ఉంది.
ఇలా ఇటు ఉద్యోగులు, అటు సంప్రదింపుల కమిటీ ఇవాళ్టి నుంచే పీఆర్సీపై ఎవరి ప్లాన్స్ వాళ్లు అమలు చేస్తున్నారు. రాబోయే 3-4 రోజుల్లో ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సమ్మె చేసే వరకు వ్యవహారం రాదని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకునే వరకు తగ్గేది లేదని ఉద్యోగులు కూడా అంతే గట్టిగా చెబుతున్నారు.