వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా సేవలందిస్తోంది. కరోనా టైమ్ లో వీళ్ల సేవలు అమోఘం. ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడంతో పాటు, ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా ప్రభుత్వం వాలంటీర్ల సేవల్ని వినియోగించుకుంటోంది. అయితే ఈ క్రమంలో ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి కూడా వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు ఎంత పెరిగాయో ప్రజలకు వివరించాలని అనుకుంటోంది జగన్ సర్కారు. ఈ మేరకు జీతాలకు సంబంధించిన పట్టిక వాలంటీర్లకు వెళ్లింది. ప్రతి వాలంటీర్ తన పరిథిలో ఉన్న ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎలా పెరిగాయో, కొత్త పీఆర్సీ వల్ల ఉపయోగం ఏంటో ప్రజలకు వివరిస్తాడు. అదే సమయంలో ఉద్యోగుల సమ్మెలో న్యాయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా ఇదే వివాదాస్పదమైంది
సమ్మెకు సిద్ధమౌతున్న ఉద్యోగుల్ని పిలిచి సంప్రదింపులు జరపాల్సిన టైమ్ లో ఇలా వాలంటీర్ల ద్వారా జీతాల గురించి ప్రజలకు వివరించాలనుకోవడం సమంజసం కాదు. ఇప్పటికే ఉద్యోగులు కాక మీదున్నారు. ఇలాంటి చర్యలు వాళ్ల ఆగ్రహావేశాల్ని మరింత పెంచుతాయి, ప్రభుత్వానికి-ఉద్యోగస్తులకు మధ్య దూరాన్ని పెంచే చర్య ఇది.
ప్రజల నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమౌతోంది. కానీ ఈ చర్య వల్ల లాంగ్ రన్ లో ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పీఆర్సీ వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు-వాలంటీర్లకు మధ్య పూడ్చని అగాథం ఏర్పడే ప్రమాదం ఉంది. దీని వల్ల ప్రభుత్వ పథకాల అమలు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో లోటుపాట్లు తలెత్తే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి సున్నితమైన అంశాలు, కొన్ని రోజుల్లో సమసిపోయే వివాదాల కోసం ఈ వ్యవస్థను వాడుకుంటే అది దుష్ప్రభావాలు చూపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టడంలో, వాళ్లు చేస్తున్న పసలేని ఆరోపణల్లో వాస్తవాల్ని ప్రజలకు చాటిచెప్పడంలో వాలంటీర్లను ఉపయోగించుకోవడంలో తప్పులేదు.
కానీ ఇలా ఒక వ్యవస్థను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి చెందిన మరో వ్యవస్థను వాడుకోవాలనుకోవడం సరైన పద్ధతి అనిపించుకోదు. పైగా ప్రజల్లో ఇప్పటికే ఉద్యోగులపై అంతోఇంతో వ్యతిరేకత ఉందనేది వాస్తవం. సోషల్ మీడియాలో అది ప్రతిబింబిస్తోంది కూడా. అలాంటప్పుడు వాలంటీర్ల వ్యవస్థతో ఆ వ్యతిరేకతను మరింత ఎగదోయాలని ప్రభుత్వం భావించడం సరైన నిర్ణయం కాదు.