విశాఖ ప్రధమ పౌరురాలు ఒక ఉద్యమానికి సంబంధించి తొలి అడుగు వేశారు. విశాఖకే కాదు, ఆంధ్రులకే గర్వకారణం అయిన ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అంటూ నినదించారు. ఈ మేరకు జీవీఎంసీ ఆద్వర్యాన జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో తానూ భాగమై మొదటి సంతకం చేశారు.
విశాఖ అంటేనే ఉక్కు నగరం అని చెబుతారు. అలా పేరు తెచ్చిన ఘనమైన నగరం కీర్తిని పెంచడానికి కొన్ని దశాబ్దాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ కృషి చేస్తోంది అని అన్నారు. విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ ఆమె కోరారు. ఉత్తరాంధ్రా అభివృద్ధికి చోదక శక్తిగా పనిచేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలనుకోవడం దారుణమని ఆమె అన్నారు.
ఎన్నో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆలంబనగా ఉంటూ వస్తున్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణమైన చర్య అని కూడా తప్పు పట్టారు. ప్లాంట్ కాపాడుకునేంతవరకూ తమ ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు. కాగా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జీవీఎంసీలోని వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొని సంతకాలు చేశారు.
విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా అంతటా తిరిగి కోటి సంతకాల సేకరణ చేపడతామని ఉద్యమకారులు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని వారు కోరుతున్నారు.
మొత్తానికి ఇప్పటిదాకా సంతకాల ఉద్యమాన్ని ఉక్కు కార్మిక సంఘాలే నిర్వహించాయి. ఇపుడు జీవీఎంసీ కూడా రంగంలోకి దిగిపోయింది. దీనికి ముందు జీవీఎంసీలో ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కూడా తీర్మానం ఆమోదించారు. చూడాలి మరి కోటి సంతకాల సేకరణతో అయినా ఉక్కు విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేస్తుందో లేదో.