ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ దాడులకు దిగే అధ్యక్షుడు ఏ తృతీయ ప్రపంచ దేశంలోనో ఉంటారు. నియంతృత్వానికి కాస్త అటూ ఇటూ ఉండే దేశాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ప్రపంచంలో ఇలాంటి దేశాలు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటి సరసన స్థానం సంపాదించింది యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. బహుశా ట్రంప్ తీరును చూస్తే.. అది అమెరికన్ సివిల్ వార్ తో పోల్చాల్సినంత అంశమేమో!
ఈ నేపథ్యంలో ట్రంప్ అభిశంసన అంశం చర్చకు వచ్చింది. మరో పది రోజుల్లో పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్న ట్రంప్ ను పీఠం నుంచి దించేసే ప్రక్రియ ఊపందుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొత్తగా అధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవడానికి మునుపే ట్రంప్ ను దించేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి అదే జరిగితే.. అమెరికా తన పరువును నిలబెట్టుకున్నట్టే అవుతుంది.
పురాతన ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్యానికి నిర్వచనాలను ఇచ్చిన దేశంగా అమెరికాకు పేరుంది. ఆ నేపథ్యానికే ట్రంప్ తీవ్ర కలంకం తీసుకొచ్చాడు. దీంతో ఆయనపై సొంత పార్టీ కూడా గుర్రుగా ఉందని అంటున్నారు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పటికీ ట్రంప్ కు మద్దతుదార్లు ఉన్నప్పటికీ.. ట్రంప్ అభిశంసన ప్రక్రియలో ఆ పార్టీ కూడా భాగస్వామి అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రెండు సభల్లో ట్రంప్ అభిశంసన తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక సభలో డెమొక్రాట్లు మెజారిటీతో ఉండటంతో అక్కడ ట్రంప్ ను తొలగించే తీర్మానం ఆమోదం పొందడం లాంఛనమే. రిపబ్లికన్ లు మెజారిటీతో ఉన్న సభలో ట్రంప్ అభిశంసన తీర్మానం ఆమోదం పొందితే అది సంచలనమే అవుతుంది.
పది రోజుల ముందో, వారం ముందో.. అయినా ట్రంప్ ను తొలగిస్తే అది అమెరికన్ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం అవుతుంది. మరి ఆ అభిశంసనతో అమెరికా తృతీయ ప్రపంచ దేశాల స్థాయికి పడిపోయిన తన పరువును నిలబెట్టుకుంటుందేమో చూడాలి!