లేఖలు రాయడంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మంచి చేతివాటం ఉందనే విషయం ఈ పాటికే రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఆయన రాసినన్ని లేఖలు ఇంకెవరూ రాయలేదని, భవిష్యత్ లో రాయబోరనే విషయం అందరికీ తెలుసు. ఉదయం ఓ లేఖ, దానికి జవాబుగా ఎవరైనా మాట్లాడితే సాయంత్రానికే మరో లేఖ.. ఇలా సాగుతోంది ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారం.
తాజాగా.. ఆయన రాష్ట్ర ఉద్యోగులకు ఓ ప్రేమపూర్వక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉద్యోగులు, ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిపై ఆయనకున్న ప్రేమాభిమానాలను ఆ లేఖలో స్పష్టం చేశారు.
హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేసి కలకలం రేపిన నిమ్మగడ్డ వ్యవహారంపై ఓవైపు మంత్రులు, అధికార పార్టీ నేతలు మండిపడుతుంటే.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ఎన్నికల సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కరోనా భయాల్లో ఎన్నికల డ్యూటీలు చేసేందుకు మేము సిద్ధంగా లేము అంటూ ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు ఎస్ఈసీకి తేల్చి చెప్పేశాయి.
పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల తరపున అధికారికంగా లేఖలు విడుదలవడంతో పాటు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమ నిస్సహాయతను తెలియజేశారు అధికారులు. ప్రభుత్వం వ్యతిరేకిస్తే కోర్టుకు వెళ్లిన నిమ్మగడ్డ, ఉద్యోగులు సహకరించకపోతే ఏం చేస్తారనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
హైకోర్టుకి వెళ్లి ఈ పంచాయితీ పెట్టే అవకాశం కనిపించడం లేదు, అందుకే ఆయన రాష్ట్ర ఉద్యోగులందరికీ ఓ ప్రేమ పూర్వక లేఖ రాశారు. కరోనా సోకకుండా మీ బాధ్యత మేం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగ సంఘాల భయాలు, సందేహాలు అన్నీ.. తమ దృష్టికి వచ్చాయని తెలిపిన ఆయన.. తామెప్పుడూ పోలింగ్ సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్ లు, గ్లౌ, శానిటైజర్లు అందించాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించిందని చెప్పారు నిమ్మగడ్డ. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా కోరారట. ఇలా.. సదరు లేఖలో ప్రభుత్వ ఉద్యోగులపై ఆయనకున్న ప్రేమాభిమానాలను బైటపెట్టుకున్నారు.
ఎన్నికలు జరపాల్సిందేనంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఉద్యోగులను మాత్రం ఇలా బతిమిలాడుకుంటున్నారు. మీకు కరోనా సోకకుండా చూసుకునే బాధ్యత నాదీ అంటూ హామీ ఇస్తున్నారు.
అసలీ కష్టాలన్నీ ఎందుకు? ఎన్నికల కోసం ఉద్యోగుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలా? పోనీ అర్జంట్ గా ఎన్నికలు జరిపి సాధించేదేమిటి? ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది కదా? ఎన్నికలు జరగకపోయినా నిధులు ఆపబోమని కేంద్రం హామీ ఇచ్చింది కదా? అయినా వ్యాక్సినేషన్ కి ప్రభుత్వం సిద్ధపడుతున్న వేళ, ఎన్నికల హడావిడి ఎందుకు? సామాన్యుల మనసుల్ని తొలిచేస్తున్న ప్రశ్నలివి. వీటిపై కూడా నిమ్మగడ్డ ఓ లేఖాస్త్రం సంధిస్తే బాగుంటుంది.