మొన్నటివరకు సంక్రాంతి కోసం సినిమాలన్నీ క్యూ కట్టాయి. దాదాపు 10 సినిమాలు తేదీలు ప్రకటిస్తే.. ఫైనల్ గా 4 సినిమాలు రెడీ అయ్యాయి. ఇప్పుడీ క్యూ సమ్మర్ కోసం సిద్ధమౌతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఈసారి కూడా దాదాపు 10 సినిమాలు వేసవికే వస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కొన్ని సినిమాలు ఇప్పటికే తేదీలు ప్రకటించగా, మరికొన్ని అదే దారిలో నడుస్తున్నాయి.
సంక్రాంతికి వస్తామంటూ ప్రకటించిన రంగ్ దే సినిమాను సమ్మర్ కు వాయిదా వేశారు. మార్చి 26న థియేటర్లలోకి వస్తామంటూ ప్రకటించారు. అయితే ఆశ్చర్యంగా అదే తేదీని రానా కూడా ఎనౌన్స్ చేశాడు. తను నటించిన అరణ్య సినిమా మార్చి 26న థియేటర్లలోకి వస్తుందంటూ ప్రకటించాడు.
ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతున్న టీజర్ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నెలలో వకీల్ సాబ్ తర్వాత నాని నటిస్తున్న టక్ జగదీష్ వస్తోంది. ఏప్రిల్ 16న టక్ జగదీష్ థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.
మే నెలలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు సాధ్యాసాధ్యాల్ని పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి షూటింగ్ ఓ కొలిక్కి వస్తే మే నెలలో ఒక తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండడంతో.. మిగతా హీరోలెవ్వరూ ఇప్పటివరకు మే నెల రిలీజ్ పై ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
ఈ సినిమాలతో పాటు గోపీచంద్ నటిస్తున్న సీటీమార్, సాయితేజ్ చేస్తున్న రిపబ్లిక్, శర్వానంద్ చేస్తున్న ద్వి-భాషా చిత్రం (ఇంకా పేరు పెట్టలేదు) కూడా వేసవిలోనే విడుదలకాబోతున్నాయి. ఇలా సమ్మర్ కోసం క్యూ కట్టిన సినిమాల్లో ఎన్ని బరిలో నిలుస్తాయో చూడాలి.