గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్‌కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు, బ్యూటీషియన్ అయిన సురేఖను పోలీసులు జైలుకు తరలించారు.
ఎస్ఐ ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేఖను అరెస్ట్ చేసిన పోలీసులు బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు ఆమెను తరలించారు.
ఇదిలా ఉండగా గుడివాడలో డీఎస్పీ సత్యానందం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి వివరాలు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల వల్లే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేల్చి చెప్పారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిళ్లకు తట్టుకోలేక మృతి చెందాడని మాజీ మంత్రి దేవినేని ఉమా చెప్పడంలో వాస్తవం లేదన్నారు.
ఆరోపణలకు ఆధారాలు చూపించాలని మాజీ మంత్రికి నోటీసులు జారీ చేస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. పోలీసులను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని ఆయన సూచించారు. ఎస్‌ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.