టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ప్రతిభాపాఠవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. బుర్ర పెంచుకో అచ్చెం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకసారి అసెంబ్లీ వేదికగా ఉచిత సలహా ఇచ్చినట్టు గుర్తు. కానీ అచ్చెన్నాయుడి తెలివితేటలు జగన్‌కు అంతగా తెలిసినట్టు లేదు.
ఒకవేళ తెలిసి ఉంటే అసెంబ్లీ సాక్షిగా అలాంటి సలహా ఇచ్చి ఉండేవారు కాదేమో. లోకేశ్ అంతటి విజ్ఞానం, ఎదుటి వాళ్లను నవ్వించగలిగే హాస్య చతురత అచ్చెన్నాయుడిలో పుష్కలంగా ఉన్నాయని అధ్యక్ష పదవి పుణ్యమా అని గుప్తనిధుల్లా బయట పడుతున్నాయి.
తిరుపతిలో పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయాన్నిబుధవారం మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు.
“సెక్యులిజానికి ” టీడీపీ కట్టుబడి ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. సెక్యులరిజానికి బదులు అచ్చెన్న సరికొత్త పదాన్ని కనుగొనడాన్ని గ్రహించొచ్చు. అలాగే ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని “ఛూ” కొడుతున్నారని అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఛీ కొట్టడానికి బదులు అచ్చెన్న ఛూ అనే కొత్త పదప్రయోగం చేయడం గమనార్హం.
అలాగే కట్టుబడి అనే పదానికి బదులు కష్టుపడి అని తనదైన శైలిలో అచ్చెన్న చెప్పుకొచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అచ్చెన్నాయుడి విలేకరుల సమావేశంలో జాలువారిన నూతన పదాలను వింటూ లోకేశ్‌ను గుర్తు చేసుకోవడం మీడియా ప్రతినిధుల వంతైంది.
గతంలో ఒకసారి కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఒక ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా ఉచ్చరించడంపై నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో జగన్ ఏమన్నారంటే మొట్ట మొదట మన మంత్రిగారిని ఇంగ్లీష్ కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని స్పీకర్ (కోడెల)ను ఉద్దేశించి అన్నారు.
అచ్చెన్నాయుడు Common ETP అనే దాన్ని Common Effect Treatment Plant అని అన్నారని, అది సరైంది కాదని జగన్ అన్నారు. దాన్ని Common Effluent Treatment Plant అని పిలుస్తారని జగన్ చెప్పారు. దీనిపై కూడా అప్పట్లో అచ్చెన్నాయుడు నానా గొడవ సృష్టించారు.
కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పుకోవాలి. అందరికీ అన్నీ తెలియాలని లేదు. కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకపోవడమే తప్పు అవుతుంది. సెక్యులరిజం అనేది కూడా తెలియకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావడం అంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది.
అంతేకాదు “ఛీ, కట్టుబడి” అనే పదాలను తప్పుల్లేకుండా పలకలేని నేత తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించడానికి మించిన విషాదం ఏముంటుంది? ఇదే లోకేశ్ తప్పులు మాట్లాడితే మాత్రం పప్పులో కాలో, చేయో వేశాడని తెగ ట్రోల్ చేస్తారు. మరి అచ్చెన్నాయుడిని ఏమంటారు?