ఆటలన్నాకా గెలుపోటములు సహజం. అలాంటి ఆటల్లో ఏదైనా సాధించామని చెప్పుకోవడం కూడా సహజమే. అయితే.. వన్డే మ్యాచ్ లలో టీమిండియాను గతంలో ఎప్పుడో తాము ఓడించామని దావోస్ సదస్సుకు వెళ్లి చెప్పుకోవడం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దివాళాకోరుతనాన్ని చాటుతూ ఉంది. దావోస్ లో అంతర్జాతీయ ఆర్థిక వేదిక సదస్సులో ఇమ్రాన్ ఖాన్.. తన క్రికెట్ కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు. తన రోజుల్లో టీమిండియాను తాము తరచూ ఓడించేవాళ్లమని ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు.
తమ దేశం కన్నా ఇండియా ఏడు రెట్లు పెద్దదని..అలాంటి దేశాన్ని ఓడించామని ఇమ్రాన్ చెప్పుకొచ్చాడు. ఇందులో ఇమ్రాన్ ఖాన్ శాడిజం అర్థం అవుతూనే ఉంది. ఇండియాను మరేం చేయలేక.. ఎప్పుడో వన్డే మ్యాచ్ లలో ఇండియాను ఓడించడాన్ని తన ప్రధాన ఘనతగా ఇమ్రాన్ చెప్పుకోవడం మరో రకంగా కామెడీగా మారుతూ ఉంది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో దాదాపు సమంగా గెలుపోటములు ఉంటాయి. 80లలో ఇండియా కన్నా పాక్ కొన్ని మ్యాచ్ లు ఎక్కువగా గెలిచి ఉండవచ్చు. అయితే ఆ తర్వాత టీమిండియా మొత్తం కథను బ్యాలెన్స్ చేసింది. పాకిస్తాన్ కు వెళ్లి, టెస్టు-వన్డే సీరిస్ లను గెలుచుకుని వచ్చింది గంగూలీ కెప్టెన్సీలో. ఇక ప్రపంచకప్ మ్యాచ్ లలో అయితే ఇంతవరకూ ఇండియా మీద పాక్ నెగ్గిన చరిత్రే లేదు! టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాక్ ను ఓడించి ఇండియా విజేతగా నిలిచింది.
ఇవన్నీ దాస్తే దాగే విషయాలు కాదు. అయినా ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో దశాబ్దాల కిందటి గతి గురించి ఏవో కొన్ని మ్యాచ్ ల విజయాలను పట్టుకుని తానేదో సాధించినట్టుగా చెప్పుకోవడమే కామెడీ. ఆటల్లో గెలుపోటములు సహజం. పాక్ గొప్పలు పాక్ కు ఉంటే.. ఇండియా గొప్పలు ఇండియాకు ఉంటాయి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం పాక్ ప్రైమ్ మినిస్టర్ కు లేనట్టుంది!