రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న కరోనా

క్రికెట్ స్కోర్, కొత్త సినిమా కలెక్షన్లు లెక్కేసుకునే రోజుల నుంచి కరోనా కేసులు లెక్కించుకునే రోజులకు వచ్చేశాం. ఇక్కడ కూడా రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గుతున్న…

క్రికెట్ స్కోర్, కొత్త సినిమా కలెక్షన్లు లెక్కేసుకునే రోజుల నుంచి కరోనా కేసులు లెక్కించుకునే రోజులకు వచ్చేశాం. ఇక్కడ కూడా రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప, తగ్గుతున్న ఛాయలు కనిపించడం లేదు. ఏరోజుకారోజు అదే అత్యథికం అన్నట్టు తయారైంది పరిస్థితి. తాజాగా దేశంలో ఒకే రోజు 9851 కరోనా కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 9851 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 226,770కు చేరుకుంది. అటు నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 273 మంది కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6348కు చేరుకుంది. ఈ లెక్కలన్నీ దేశంలో ఒకరోజు అత్యథికాలే. కొత్తగా నమోదైన రికార్డులే.

మహారాష్ట్రలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుంది కరోనా. అక్కడ ఏరోజుకారోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 2933 కొత్త కేసులు నమోదవ్వడంతో పాటు 123 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,793కు, మృతుల సంఖ్య 2710కు చేరుకుంది.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న తమిళనాడులో 1384 కొత్త కేసులు నమోదుకాగా.. ఢిల్లీలో 1359 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల స్థాయిలో దేశంలో మరే రాష్ట్రంలో కరోనా విజృంభన లేదు.

కరోనా టాప్-5 రాష్ట్రాలు
1. మహారాష్ట్ర – మొత్తం కేసులు 77,793 – మృతులు 2710
2. తమిళనాడు – మొత్తం కేసులు 27,256 – మృతులు 220
3. ఢిల్లీ – మొత్తం కేసుల సంఖ్య 25,004 – మృతులు 650
4. గుజరాత్ – మొత్తం కేసులు 18,584 – మృతులు 1155
5. రాజస్థాన్ – మొత్తం కేసులు 9862 – మృతులు 213

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను