ఒక్క రోజు అనుకున్న జనతా కర్ఫ్యూ కేవలం టెస్టింగ్ డోస్ అయ్యింది. మార్చి 31 వరకూ ఇప్పటికే లాక్ డౌన్ ను ప్రకటించేశాయి వివిధ రాష్ట్రాలు. దేశ వ్యాప్తంగా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉండగానే.. ప్రధానమంత్రి 21 రోజుల పాటు టోటల్ లాక్ డౌన్ అంటూ ప్రకటించేశారు. ప్రస్తుతానికి మోడీ చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 14 వరకూ దేశ వ్యాప్తంగా సర్వం మూతపడనున్నాయి.
రాష్ట్రాలకు రాష్ట్రాలు సరిహద్దులే మూసేసుకున్నాయి. ప్రభుత్వ రవాణా రంగం స్తంభించిపోయింది. ప్రైవేట్ వాహనాలనూ రోడ్డు మీదకు రానివ్వడం లేదు. కార్లు, బైకులు రోడ్ల మీదకు వస్తే సీజ్ చేసేస్తూ ఉన్నారు. అయినా కంట్రోల్ లోకి రాని చోట వాహనదారులపై పోలీసులు లాఠీ ఝలిపిస్తూ ఉన్నారు.
ఎంతగా చెప్పినా వినడం లేదని పోలీసులు లాఠీలకు పని చెబుతూ ఉండటంతో.. రోడ్డు మీదకు వచ్చిన జనాలు కూడా పరార్ అవుతున్నారు. ఇలా ఎన్ని రోజులూ అనేది సమాధానం లేని ప్రశ్నే. ఏపీ, తెలంగాణ సీఎంలు మార్చి 31 వరకూ అని ఇది వరకూ ఒక తేదీ చెప్పారు. అయితే అదేమీ తుది గడువు కాదు. తాజాగా ప్రధానమంత్రి దాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. స్వీయ నిర్బంధం తప్ప కరోనాను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మార్గం లేదని ఆయన తేల్చారు.
నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయని, ఆందోళన చెందనక్కర్లేదని మోడీ ప్రకటించారు. తను ప్రధానిగా గాక, ఒక కుటుంబ సభ్యుడిగా చెబుతున్నట్టుగా ఆయన దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. కఠినంగా అయినా ఈ లాక్ డౌన్ ను అమలు చేస్తారని స్పష్టం అవుతోంది, ప్రజలు పూర్తిగా సహకరించాల్సిన అవసరం కూడా తీవ్రంగా ఉంది.