కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది, వచ్చేసింది.. మరో వారం రోజుల్లో కొంతమందికి ప్రభుత్వం ఆ వ్యాక్సిన్ ఇవ్వనుందన్న ప్రకటన నేపథ్యంలో.. ఈ వ్యాక్సిన్ లపై ప్రజల్లో నమ్మకమెంత, వాటిని వేసుకోవడానికి వారెంత వరకూ సిద్ధంగా ఉన్నారు? అనే అంశాల గురించి ఆసక్తిదాయకమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటి ప్రకారం సూఛాయగా స్పష్టం అవుతున్న విషయం ఏమిటంటే.. మెజారిటీ భారతీయుల్లో వ్యాక్సిన్ పై అనాసక్తి ఉందనేది!
కొన్ని వేల మంది అభిప్రాయాలను తీసుకున్న ఈ సర్వేల్లో మెజారిటీ మంది కరోనా విరుగుడు వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి తమకెలాంటి సంసిద్ధతా లేదని స్పష్టం చేశారట. ఈ అంశం గురించి అక్టోబర్, నవంబర్ మాసాల నుంచినే సర్వేలు జరిగాయి.
వాటి ప్రకారం.. అక్టోబర్ లో దాదాపు 59 శాతం మంది వ్యాక్సిన్ పై అనాసక్తిని వ్యక్తం చేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ వచ్చేస్తే వేయించుకుంటారా? అనే ప్రశ్నకు సింపుల్ గా 'నో' అని సమాధానం ఇచ్చారట అంతమంది.
నవంబర్ లో కూడా దాదాపు అలాంటి అభిప్రాయాలే వ్యక్తం అయ్యాయని ఒక అధ్యయన సంస్థ చెబుతోంది. గత ఏడాది డిసెంబర్ పరిణామాల ఆధారంగా అభిప్రాయాలను తీసుకుంటే.. దాదాపు 69 శాతం మంది కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి తాము రెడీగా లేమని స్పష్టం చేశారట!
కేవలం 26 శాతం మంది మాత్రమే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే వేయించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టుగా చెప్పారట. దాదాపు ఎనిమిది వేల మంది అభిప్రాయాలతో ఈ సర్వే జరిగినట్టుగా ఆ సంస్థ పేర్కొంది.
ఇంతకీ వ్యాక్సిన్ పై అనాసక్తికి కారణం ఏమిటి? అంటే.. దానికి సింపుల్ గా వస్తున్న సమాధానం, సైడ్ ఎఫెక్ట్స్ భయాలే. కరోనా తీవ్రంగా వ్యాపించిన రోజుల్లో వ్యాక్సిన్ వచ్చేస్తే బాగుండని అంతా ఆలోచించారు. అయితే రోజులు, నెలలు గడిచే కొద్దీ వ్యాక్సిన్ అంటే అలా తయారు చేసి, ఇలా ఇంజెక్ట్ చేసేది కాదని ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది.
ఇదే సమయంలో ఇండియాలో కరోనా నంబర్లు తగ్గ సాగాయి. ప్రజలు తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు కరోనా గురించి పట్టించుకునే వారెవరూ లేరు. మాస్కులు కూడా తీసేసి తిరుగుతున్నారు.
నూటికి 90 శాతం మంది మాస్కులు లేకుండానే కనిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కరోనాను ఇండియన్స్ దాదాపు మరిచిపోయినట్టుగా తమ పనులు చేసుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టే అని ప్రభుత్వం చెబుతోంది. అయితే సైడ్ ఎఫెక్ట్స్ గురించిన వార్తలు, వ్యాక్సిన్ లపై పూర్తి స్థాయి ప్రయోగాలు జరగలేదేమో అనే అనుమానాలు, ఆ పై ఇండియన్స్ లో ఇలాంటి వ్యాక్సిన్ లపై మొదటి నుంచి ఉండే అనాసక్తి, ఇప్పటికే కరోనా తగ్గిపోయిందని జనాలు బలంగా నమ్ముతూ ఉండటం.. ఇవన్నీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చినా.. వేయించుకోవడానికి మాత్రం ప్రజల్లో అనాసక్తి బలీయంగా ఉన్నట్టుంది.