టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిన విషయాన్ని సోమిరెడ్డి స్వయంగా వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
“అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను..హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు.”
సోమిరెడ్డికి కరోనా అనే విషయం తెలియడంతో చంద్రబాబుతో సహా, మొత్తం టీడీపీ సీనియర్ నాయకులంతా ఉలిక్కిపడ్డారు. వీళ్ల టెన్షన్ కు ఓ కారణం ఉంది. అదేంటంటే.. కరోనా నిర్థారణకు 2 రోజుల ముందు వరకు సోమిరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలామంది టీడీపీ నేతలతో ఆయన దగ్గరగా మాట్లాడారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిన్న విజయవాడలో జరిగింది. స్వయంగా సోమిరెడ్డి బెజవాడలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటుచేశారు. అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోను కూడా సోమిరెడ్డి పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. మొన్న సోమవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు చాలామంది టీడీపీ ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో టీడీపీ నేతల్లో గందరగోళం నెలకొంది.
సోమిరెడ్డికి పాజిటివ్ అని తెలిసిన వెంటనే అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా తమ సమావేశాలు, కార్యక్రమాలు రద్దుచేసుకున్నారు. అంతా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు.