జూనియర్ ఎన్టీఆర్ తో కమ్మ వర్గానికి చెందిన కొందరు పెద్దలు సమావేశం అయిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వర్గంలో పెద్ద మనుషులుగా చెప్పుకునే దాదాపు 8 మంది కమ్మోళ్లు.. ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుదీర్ఘంగా గంటన్నర పాటు వీళ్లు అనేక అంశాలపై మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది.
చర్చకొచ్చిన అంశాలేంటి..?
ఇటీవల ఏపీ రాజకీయాల్లో కులాల ప్రస్తావన బాగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ కాపులందర్నీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అదే సమయంలో వైసీపీలో ఉన్న కాపు నాయకులను కించ పరుస్తూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికైనా కాపు బలం పెంచుకోవాలని తద్వారా కనీసం తాను పోటీ చేసిన స్థానంలో అయినా గెలవాలని అనుకుంటున్నారు.
మరోవైపు అటు సినీ ఇండస్ట్రీలో కూడా వ్యవహారం కమ్మ వర్సెస్ కాపు అనేట్టుగా మారిపోయింది. కమ్మవారి ప్రతినిధిగా మంచు విష్ణు, కాపుల మద్దతుతో ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు విషయాలు ఎన్టీఆర్ తో జరిగిన కీలక భేటీలో ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది.
అదే సమయంలో టీడీపీ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. తాతతో పాటు, తాత స్థాపించిన పార్టీ అంటే జూనియర్ కి బాగా ఇష్టం. అయితే వాడుకుని వదిలేశారనే ఒకే ఒక్క కారణంతో ఆయన చంద్రబాబుకి దూరం జరిగారు.
సొంత అక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆ వైపు కూడా చూడలేదు. కానీ ఇప్పుడు టీడీపీకి ఎన్టీఆర్ అవసరం బాగా ఉంది. పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ దశలో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడితే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
అసలు ఇది ఎవరి రాయబారం?
ఎన్టీఆర్ ఇప్పటి వరకూ క్యాస్ట్ బేస్డ్ వ్యవహారాలు నడిపినట్టు ఎక్కడా బయటకు రాలేదు. అలాగని ఎవరి కులం అంటే వారికి అభిమానం ఉండదని చెప్పలేం. అందులోనూ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మవారిలో ఐక్యత మరింత పెరిగిందని చెబుతుంటారు.
దీంతో సహజంగానే ఎన్టీఆర్ కి ఆ మాట ఈమాటా చెప్పి చాలామంది దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మీటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఎవరి రాయబారం లేదని, పెద్దలంతా ఓ మాట అనుకుని తారక్ వద్దకు వచ్చారని అంటున్నారు.
ఎన్టీఆర్ మనసు మార్చే ప్రయత్నమా..?
ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కనీసం సినిమా విషయాల్లో కూడా అంతకు ముందున్న దూకుడు అస్సలు లేదు. పూర్తిగా డౌన్ టు ఎర్త్ అనేలా బిహేవ్ చేస్తున్నారు. తనవారెవరు, పరాయి వారెవరు అనే విషయంలో ఎన్టీఆర్ కి ఇప్పుడు బాగా క్లారిటీ ఉంది. అందుకే ఆయన తాతపై అభిమానమున్నా, తాత స్థాపించిన పార్టీకి మాత్రం పూర్తిగా దూరం జరిగారు. ఈ దూరాన్ని దగ్గర చేసేందుకే ఈ భేటీ జరిగిందని అంటున్నారు.
ఆమధ్య టీడీపీకి గుడ్ బై చెబుతారనుకున్న బుచ్చయ్య చౌదరి కూడా ఎన్టీఆర్ ని పార్టీలోకి తేవాలని గట్టిగా మాట్లాడారు. ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతున్నా ఎన్టీఆర్ మాత్రం అంటీముట్టనట్టే ఉన్నారు. ఇప్పుడు ఆయనలో కదలిక తేవాలనే ప్రయత్నం జరుగుతోంది.
బాబుతో కలిపే ప్రయత్నమా.. బాబుకు పొగబెట్టే యత్నమా..?
ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు మనసు మార్చుకుని టీడీపీ తరపున ప్రచారం మొదలు పెట్టినా.. పార్టీ ఆయన ద్వారా లాభపడినా.. చివరకు ఏమవుతుందో అందరికీ బాగా తెలుసు. ఎన్టీఆర్ ని వాడుకుంటారు, లోకేష్ ని అందలమెక్కిస్తారు.. అదే జరిగేది. అందుకే ఇప్పుడు టీడీపీ బాగుపడాలంటే చంద్రబాబు దూరంగా ఉండాలనే వాదన మొదలవుతోంది. ఆ లెక్కలో బాబుతో ఎన్టీఆర్ ని కలుపుతారా..? లేక ఎన్టీఆర్ ని తెరపైకి తెచ్చి బాబుకి పొగపెడతారా అనేది తేలాల్సి ఉంది.
మొత్తమ్మీద ఎన్టీఆర్ తో కమ్మ పెద్దల సమావేశం మాత్రం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ కుల రాజకీయాల లెక్కలన్నీ పూర్తిగా తెరపైకొస్తున్న వేళ.. కమ్మ పెద్దలు తమ ప్రతినిధిగా చంద్రబాబు కంటే ఎన్టీఆరే బెటరని అనుకుంటున్నారు. కానీ ఒకప్పటిలా తారక్ ఇప్పుడు ఆవేశపడడం లేదు.
ఎంత రెచ్చగొట్టినా ఆయన రెచ్చిపోయే అవకాశం లేదు. ఒకవేళ నిజంగానే రెచ్చిపోతే చంద్రబాబు రాజకీయ పతనం సంపూర్ణం అవుతుందనడంలో అనుమానం లేదు.