నెల్లూరులో వైసీపీ అంతర్గత రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఇప్పటికే ఓ సారి సీఎం జగన్ వద్ద పంచాయితీ జరిగింది. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇలాకాలో ఓ ప్రభుత్వ అధికారిని బెదిరించిన కేసు నేపథ్యంలో మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయి, వెనువెంటనే విడుదలయ్యారు. ఆ తర్వాత వీరిద్దర్నీ జగన్ పిలిపించి తీవ్రంగా మందలించి పంపించేశారు.
అయితే ఆ గొడవ అక్కడితో సద్దుమణగ లేదు. రావణకాష్టంలా రగులుతూనే ఉంది. జిల్లాలో రెండు వర్గాలున్నాయి. సీనియర్ నాయకులైన ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక గ్రూపు. వీరిద్దరికీ మంత్రి పదవులు రాలేదు. యువకులైన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక గ్రూపు. వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు మధ్యేమార్గంగా ఉంటారు. సీనియర్లు, జూనియర్ల మధ్య మాటల యుద్ధంతోపాటు ఆధిపత్య పోరు కూడా కొనసాగుతూనే ఉంది.
సీఎం కప్ పేరుతో జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల మంత్రి అవంతి శ్రీనివాస్ చీఫ్ గెస్ట్ గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే జిల్లాలోనే ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి మొహం చాటేశారు. ఆహ్వానం అందలేదనేది మరో పుకారు. కారణం.. ఈ పోటీలు జరిగేది ఎమ్మెల్యే కాకాణికి చెందిన సర్వేపల్లి నియోజకవర్గంలో. వీరిద్దరి మధ్య సయోధ్య లేకపోవడంతో సీఎం కప్ కి జిల్లా మంత్రి డుమ్మా కొట్టారు. మరో మంత్రి మేకపాటి జిల్లాలోనే లేకుండా తప్పించుకున్నారు.
సీఎం కప్ పేరుతో ప్రతి జిల్లాలో క్రీడా పోటీల్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. జిల్లా మంత్రులే వీటిని దగ్గరుండి పర్యవేక్షించేవారు. కానీ నెల్లూరులో ఆధిపత్య పోరుతో జిల్లా మంత్రులిద్దరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ విషయం సీఎం వరకూ చేరిందని, అయితే మంత్రులుగా ఉన్న జూనియర్ బ్యాచ్ నే జగన్ సమర్థించడంతో గొడవల కోసం ఎదురు చూసేవారి ఆటలు సాగలేదని సమాచారం.
ఇప్పుడు కాకపోయినా రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేసే సమయంలోనైనా జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికే అవకాశాలున్నాయి. మొత్తమ్మీద నెల్లూరులాంటి కొన్ని జిల్లాలు జగన్ కి తలనొప్పిగా మారుతున్నాయన్నది మాత్రం వాస్తవం. అయితే ఇలాంటి బెదిరింపులకి జగన్ ఏమాత్రం తలొగ్గేరకం కాదని ఇదివరకే తేలిపోయింది. సీనియర్లయినా, జూనియర్లయినా.. జగన్ మాటమీద నడవాల్సిందే. కాకపోతే అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు, అలకలు అలా అలా బయటపడుతుంటాయి.