చినబాబు భవితవ్యం ఏమిటి?

చంద్రబాబుగారి అబ్బాయి చినబాబు. నారా లోకేష్ నాయుడు అన్నది పూర్తి పేరు. సినిమా, రాజకీయ రంగాల్లో బడాబాబుల పిల్లలకు అసలు పేర్లు కన్నా కొసరు పేర్లే ముద్దు. బాబు లేదా పెదబాబు, కాదంటే చినబాబు.…

చంద్రబాబుగారి అబ్బాయి చినబాబు. నారా లోకేష్ నాయుడు అన్నది పూర్తి పేరు. సినిమా, రాజకీయ రంగాల్లో బడాబాబుల పిల్లలకు అసలు పేర్లు కన్నా కొసరు పేర్లే ముద్దు. బాబు లేదా పెదబాబు, కాదంటే చినబాబు. ఇలాగే పిలుచుకోవాలి. అందువల్ల లోకేష్ బాబు ఎప్పటికీ చినబాబే. ఇప్పుడు ఈ చినబాబు వచ్చే ఎన్నికల నాటికి నలభయ్యవ పడిలోకి వస్తారు. ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రవేశించి పదేళ్లు దాటింది. 2009లో తండ్రి వెనుక వుండి, ఎన్నికల ప్రచార సామగ్రి, కార్యక్రమాల ప్లానింగ్ ఇలాంటి పనులు అన్నీ పార్టీ  ఆఫీసులో వుండి టేకప్ చేసారు. అది చినబాబు రాజకీయ ప్రస్థానానికి పునాది. అయిదేళ్లు తిరిగేసరికి ఆయన మంత్రి. ప్రభుత్వ..పార్టీ పగ్గాలు దాదాపు అన్నీ ఆయన చేతుల్లోనే.

నిజంగా ఇదంతా స్వయం కృషా? ఆయన సాధించిన విజయమా? ఇలా ప్రశ్నించుకుంటే, కేవలం అనూచానంగా, తండ్రి చాటు బిడ్డగా,  వారసత్వంగా సంక్రమించినది తప్ప, ఆయనగా సాధించినది ఏమిటి? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో వున్నారు. మరో నాలుగేళ్లలో రాబోయే ఎన్నికల్లో మరోసారి తలపడాల్సి వుంది. ఇలాంటి నేపథ్యంలో అసలు లోకేష్ అనే చినబాబు భవితవ్యం ఎలా వుంది? ఎలా వుండబోతోంది అన్నది ఓ సారి అవలోకించాల్సిన అవశ్యం వుంది. ఎందుకంటే మరోనాలుగేళ్ల తరువాత చంద్రబాబు ఇంకా వృద్దులు అవుతారు. జగన్, పవన్ అనే ఇద్దరు యంగ్ పొలిటికల్ లీడర్లను ఢీకొనాల్సింది లోకేష్ బాబే.  అందుకే ఈ పరిశీలన.

గడచిన అయిదేళ్లు

గడచిన అయిదేళ్లలో చినబాబు కింగ్. అందులో సందేహం లేదు. పార్టీలో ఆయనదే హవా. అధికారంలో ఆయనకు మంత్రి పదవి అయాచితంగా అందివచ్చింది. కానీ అయిదేళ్ల తరువాత చూసుకుంటే ఆయన సాధించింది ఏముంది? అన్న ప్రశ్నమాత్రమే మిగుల్తుంది. పార్టీని బలోపేతం చేసిన ధాఖలా లేదు. అందుకు ప్రత్యేకంగా లోకేష్ చేసిన కృషి కనిపించదు. పార్టీ కార్యకర్తలకు భీమా, గుర్తింపు కార్డులు ఇలాంటి కార్పొరేట్ స్టయిల్ వ్యవహారాలు మినహా మరేమీ కానరావు. ఆయన ఇంగ్లీష్ మీడియం చదువు వల్ల కావచ్చు, నాలుక సరైన పలుకులు పలకడానికి సహకరించక కావచ్చు, అనేక సార్లు అభాసుపాలయ్యారు.

ఒక్కోసారి ఒక్కొక్కరు ఎందుకు ఎలా ముద్రపడతారు అన్నది అర్థం కాదు. రాహుల్ గాంధీ అలాగే మొద్దబ్బాయి మాదిరిగా తన రాజకీయ ఎర్లీ డేస్ లో ముద్ర పడిపోయారు. రాను రాను ఆయన రాటు దేలినా, రాజకీయ ప్రసంగాలు అద్భుతంగా చేసినా ఆ ముద్ర మాత్రం పోలేదు. రాహుల్ ను ఓ ప్రధాని అభ్యర్థిగా ఈ దేశ ప్రజానీకం ఇప్పటికైతే అంగీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని కీలక తరం అంతరించిపోతోంది. తదనుగుణంగా రాహుల్ గాంధీ లో వచ్చిన మార్పు కూడా గుర్తింపు కు నోచుకోకుండా పోతోంది.

లోకేష్ వ్యవహారం కూడా ఇలాగే వుంది. ఎందుకో ఆయన కూడా కాస్త మొద్దబ్బాయిగానే ముద్రపడ్డారు. పప్పు అనే ప్రచారం ప్రతిపక్షాలది అయితే కావచ్చు. కానీ ఆయన ఒక డైనమిక్ లీడర్ అని మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఆయన లాంగ్వేజ్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా అందుకు కొంత కారణమైంది. వయస్సు మీద పడినా చంద్రబాబు ఇప్పటికీ కాస్త డైనమిజం కనబర్చగలుగుతున్నారు కానీ, లోకేష్ దగ్గర నుంచి మాత్రం అది రావడం లేదు.

కేటిఆర్ భిన్నంగా..

అదే సమయంలో మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కేటిఆర్ ఇందుకు పూర్తి భిన్నంగా దూసుకుపోతున్నారు. కేసిఆర్ ఛాయలోంచి కేటిఆర్ ఎప్పుడో బయటపడిపోయారు. ఆయన స్వంతంగా ఎన్నికలను డీల్ చేయడం నుంచి విదేశీ వేదికల మీద కూడా తన డైనమిజాన్ని నిరూపించేసుకున్నారు. ఇప్పుడు కేటిఆర్ కు అంటూ ఓ స్వంత మార్కు వచ్చేసింది. ఆ తరహా మార్కు లో ఒక్కశాతం కూడా ఇప్పటికీ చినబాబు లోకేష్ కు రాలేదు. నిజానికి గత అయిదేళ్లలోనే కేటీఆర్ ఇది సాధించారు. కానీ అదే సమయంలో ఆ స్థాయి లోకేష్ సాధించలేకపోయారు.

నడుస్తున్న చరిత్ర

ఇప్పుడు ఆంధ్రలో తెలుగుదేశం ప్రతిపక్షంలో వుంది. దాదాపు కీలక నాయకులంతా చేష్టలుడిగి కూర్చున్నారు. అమరావతి సమస్య వచ్చింది కాబట్టి కృష్ణ, గుంటూరు ప్రాంత నాయకులు కాస్త గొంతు విప్పుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఈ వయసులో కూడా పాపం, కిందా మీదా అవుతున్నారు. ఆఖరికి బస్ యాత్రకు రెడీ అవుతున్నారు.

మరి ఇంతకీ ఇలాంటి కీలకసమయంలో లోకేష్ ఏం చేస్తున్నట్లు? చినబాబు ఎందుకు కేవలం ట్విట్టర్ కే పరిమితం అవుతున్నారు. ట్విట్టర్ లో కూడా ఆయన కేవలం తన పార్టీ జనాల అటెన్షన్ ను తీసుకుంటున్నారు తప్ప, జనరల్ గా యువతరం ఆసక్తిని తన వైపు తిప్పుకోలేకపోతున్నారు. కానీ అదే కేటీఆర్ ట్విట్టర్ అక్కౌంట్ చూస్తే అలా వుండదు. దానిని రాజకీయాలకు అతీతంగా యువత ఫాలో అవుతూ వుంటుంది.

నిజానికి మూడు రాజధానుల సమస్య లాంటి కీలక విషయం వచ్చిన తరువాత కార్యాచరణ రంగంలోకి దిగాల్సింది చంద్రబాబు కాదు చినబాబే. కానీ చంద్రబాబు కానీ చినబాబు కానీ ఎందుకో అలా ఆలోచించడం లేదు. చినబాబు కేవలం ట్విట్టర్ కు పరిమితమైపోయారు. నిజానికి కార్యక్షేత్రంలోకి లోకేష్ దిగి, రాష్ట్రం అంతా తిరిగినా, లేదా బస్ యాత్ర చేసినా, ఆయనకు మైలేజ్ వచ్చే అవకాశం వుంటుంది. కానీ లోకేష్ అలాంటి ఆలోచన చేస్తున్నట్లు కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ ఆయన అనుకూల మీడియా కూడా చంద్రబాబునే ముందుకు తోస్తోంది. ఆయననే ముందుకు ప్రొజెక్ట్ చేస్తోంది. బాబు ను గెలిపించకపోవడం వల్లనే ఇదంతా అంటోంది. మళ్లీ బాబే రావాలి అనే దిశగా వార్తలు ప్రచారం చేస్తున్నారు.

కానీ ఇది ఇప్పుడు బాగానే వుంటుంది. జగన్ దురదృష్టమో, బాబు అదృష్టమో కలిసి వచ్చి మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే అప్పుడు చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాల్సిందే. పార్టీ అదే చేస్తుంది కూడా. అప్పుడు కూడా లోకేష్ ది మళ్లీ బ్యాక్ సీట్ డ్రయివింగ్ నే. కానీ దీనివల్ల ఏం జరగుతుంది?లోకేష్ అధికారం చెలాయించవచ్చు కానీ, ప్రజల్లో పరపతి పెంచుకోవడం కష్టం.

ఇవ్వాళ కాకపోవచ్చు, 2024 నాటికి కావచ్చు, ఆ తరువాత కావచ్చు. ఎప్పటికైనా లోకేష్ నేరుగా పవన్ తో, జగన్ తో పోటీ పడి తన డైనమిజం ను నిరూపించుకోవాల్సిందే. దానికి ఇప్పటి నుంచీ కష్టపడడం, బాటలు వేసుకోవడం అవసరం. అలా కాకుండా బాబు వున్నంత కాలం తండ్రి చాటు బిడ్డగానే వుంటాను అనుకుంటే లేదా ఆయనను అలా వుంచాలి అనుకుంటే అది తప్పిదమే అవుతుంది.

చంద్రబాబు రాజకీయ తెరమీద లేని తరుణం వచ్చినపుడు లోకేష్ ఒక్కసారికి యుద్దంలోకి దిగితే వ్యవహారం వేరుగా వుంటుంది. అదే బాబు వెనుక వుండి, తన సలహా, సహకారాలతో గెలిచినా, ఓడినా, మంచి అయినా, చెడు అయినా, రాటుకి పోటుకి తట్టుకుంటూ లోకేష్ ను ముందుకే నడిపిస్తే అది వేరుగా వుంటుంది.  అలా అలా జనాల్లో లోకేష్ అన్న వాడు కూడా ఓ లీడర్, ఓ కాంపిటీటర్ అన్నది ముద్ర అవుతుంది.

పార్టీలో యంగ్ తరంగ్

లోకేష్ సంగతి అలా వుంచితే తెలుగుదేశం  పార్టీలో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితర యువతరంగం వుంది. వాళ్లు ఇప్పటికే పార్టీకి అతీతంగా కాస్త రాణింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వారికంటూ ఫాలోయింగ్ వుంది. ఇప్పుడు కాకున్నా, మరో నాలుగేళ్లలో ఇలాంటి వాళ్లు మరికొంత మంది తెలుగుదేశంలో పుట్టుకురావడం ఖాయం. అది అనివార్యం. కానీ ఇలాంటి వాళ్ల కన్నా మెరుగు అనిపించుకుంటేనే చినబాబుకు భవితవ్యం. బాబు గారి పరోక్షంలో పార్టీని ఏకతాటిపై వుంచాలని లోకేష్ ఇలాంటి యంగ్ తరంగ్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సి వుంది. అలా జరగాలంటే ఆయన ఇఫ్పటి నుంచీ రాజకీయ యవనిక మీద తరుచుగా ప్రత్యక్షం కావాల్సి వుంది.

చంద్రబాబు గారి బస్ యాత్ర కన్నా, చినబాబు పాదయాత్ర లాంటిది చేపడితే ఇలాంటిది సాధ్యం కావచ్చు. ఎన్నికలకు రెండేళ్లు ముందుగా అయినా ఇలాంటి ఆలోచన చేయాలి. అలా కాకుండా చంద్రబాబు కిందా మీదా ఆయాసపడి, కష్టపడి, ఎత్తులకు పై ఎత్తులు వేసి, తన మీడియా సహకారంతో 2024లో అధికారం సాధించినా, ఆయన అనంతరం దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం లోకేష్ కు కష్టం అవుతుంది. ఎందుకంటే అయాచితంగా వచ్చింది వేరు కష్టపడింది వేరు. కష్టపడింది చేజారితే మళ్లీ కష్టపడి సాధించుకోవచ్చు. అయాచితంగా వచ్చింది చేజారితే కష్టం ఎలా చేసి సాధించాలో తెలియదు. మళ్లీ అయాచితంగా ఎలా వస్తుందో అని చూడడం తప్ప.

ప్రస్తుతం లోకేష్ ఇలా అయాచిత ఫలితం కోసం చూస్తున్నారు. చంద్రబాబు తన కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబుకి చినబాబుకి ఇదీ తేడా.

చాణక్య
[email protected]