ఎక్కడో రష్యాలో ఒక జంటను ప్రేమ కలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రతిరోజూ ప్రేమ పెళ్లిళ్లు, సహజీవనం…పేరు ఏదైనా కావచ్చు కానీ, కలిసి జీవిస్తుంటారు. అలాంటప్పుడు ఈ జంట ప్రత్యేకత ఏంటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అవును ఈ జంట ఎంతో స్పెషల్. ఎందుకంటే వాళ్లిద్దరి మధ్య తల్లీకుమారుడి బంధం ఉండింది. కానీ ఇప్పుడు భార్యాభర్తలయ్యారు.
రష్యాలోని మెరీనా బల్మషేవ (35) సోషల్ మీడియా స్టార్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలెక్స్ ఆరే అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. పదేళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. పిల్లల బాధ్యతను అతనికే అప్పగించారామె.
ఈ నేపథ్యంలో అలెక్స్ ఆరే 20 ఏళ్ల కుమారుడు వ్లాదిమిర్ వోయా తనను పెంచిన తల్లి మెరీనా ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లి…ఎట్టకేలకు తాజాగా రిజిస్ట్రీ కార్యాలయంలో ఒక్కటయ్యారు. పెంపుడు తల్లిని వరుసకు కొడుకు అయ్యే యువకుడు పెళ్లి చేసుకున్న వార్త సోషల్ మీడియా హల్‌చల్ చేసింది. వారిద్దరి పెళ్లి వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఈ విషయమై ఆమె స్పందిస్తూ తన పెళ్లి తనిష్టం వచ్చినట్టు చేసుకున్నానని జవాబిచ్చారామె. ఇంకో ముఖ్య విషయం…ప్రస్తుతం ఆమె గర్భవతి. తల్లి సమానురాలిని పెళ్లి చేసుకోవడం సహజంగా మన సంప్రదాయం వ్యతిరేకిస్తుంది. అంతేకాదు, అలాంటి జంటను అసహ్యించుకుంటుంది కూడా. కానీ ఏం చేద్దాం…ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు. అన్నిటినీ గౌరవించాల్సిందే.