వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

తిరుప‌తి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక ఫ‌లితం నిన్న వెలువ‌డింది. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్…

తిరుప‌తి ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన అధికార పార్టీ వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైందా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక ఫ‌లితం నిన్న వెలువ‌డింది. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మిపై 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

ఇది భారీ మెజార్టీనే. అయితే అధికార పార్టీ పెట్టుకున్న అంచ‌నా ల‌తో పోల్చుకుంటే మెజార్టీ బాగా త‌గ్గింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ అంచ‌నాకు త‌గ్గ‌ట్ట మెజార్టీ రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఓటింట్ శాతం త‌గ్గ‌డ‌మే అని టీటీడీ చైర్మ‌న్‌, చిత్తూరు జిల్లా ఇన్‌చార్జ్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఇక్క‌డ ప్ర‌ధానంగా వైసీపీ ఆవేద‌నంతా త‌మ అంచ‌నాకు త‌గ్గ‌ట్టు మ‌రింత భారీ మెజార్టీ రాక‌పోవ‌డం కంటే, టీడీపీకి అనూహ్యంగా 3,54,516 ఓట్లు రావ‌డం ఏంట‌నే ఆవేద‌న క‌నిపిస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప‌ల్లె, ప‌ట్ట‌ణం, న‌గ‌రం అనే తేడా లేకుండా అధికార పార్టీ ఊడ్చేసింది. అస‌లు ప్ర‌తిప‌క్షాల ఉనికే లేకుండా చేసింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కంటే స్థానిక సంస్థ‌ల్లో మ‌రిన్ని ఘ‌న విజ‌యాల‌ను వైసీపీ సొంతం చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ సాధించిన ఓట్ల శాతాన్ని అధ్య‌య‌నం చేస్తే …స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విజ‌యాలను తిరుప‌తి ఉప ఎన్నిక విజ‌యం వెక్కిరిస్తోంద‌ని చెప్ప‌క‌ త‌ప్ప‌దు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం బ‌లుపా? వాపా? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్నార్థ‌క‌మైంది. 

గ‌త 23 నెల‌ల పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు అక్ష‌రాలా ల‌క్ష కోట్ల రూపా యల‌ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశామ‌ని ఘ‌నంగా చెప్పుకునే అధికార పార్టీ వైసీపీ …తిరుప‌తి ఉప ఎన్నిక‌లో కేవ‌లం 1.76% ఓటింగ్‌ను మాత్ర‌మే పెంచుకోగ‌లిగింది. మ‌రి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 75%, 80% ఓటింగ్‌ను సాధించామ‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకున్న వైసీపీ నేత‌లు, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో 56.67% కు మాత్ర‌మే ఎందుకు ప‌రిమితం కావాల్సి వ‌చ్చిందో జ‌వాబు చెప్పాల్సి వుంది.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు 54.91 శాతం ఓట్లు ద‌క్కించుకుని త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మిపై 2,28,376 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి 56.67 శాతం ఓట్లు సాధించి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ప‌న‌బాక ల‌క్ష్మిపై 2,71,592 మెజార్టీతో గెలుపొందారు. గ‌తంతో పోల్చుకుంటే వైసీపీ 1.76% ఓటింగ్‌ను పెంచుకుని 43,216 అధిక ఓట్ల‌ను సాధించింది. అయితే భారీ మెజార్టీతో గెలుపొందామ‌ని వైసీపీ పైకి గాంభీర్యంగా చెప్పుకుం టున్నా … లోలోన‌ మాత్రం అంత ఆనందంగా లేద‌ని తెలుస్తోంది.

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌లేద‌ని తిరుప‌తి ఉప ఎన్నిక చెప్ప‌క‌నే చెబుతోంది. అదెలాగో లెక్క‌ల‌తో స‌హా ప‌రిశీలిద్దాం.

2019లో తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌లో వైసీపీ సాధించిన ఓట్ల శాతం చూద్దాం. తిరుప‌తిలో 43.85%, శ్రీ‌కాళ‌హ‌స్తి 55.13%, స‌త్య‌వేడు 57.99%, గూడూరు 59.68%, గూడూరు 59.68%, స‌ర్వేప‌ల్లి 51.18%, సూళ్లూరుపేట 61.10%, వెంక‌ట‌గిరి 56.03%. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో తిరుప‌తిలో 55.25%, శ్రీ‌కాళ‌హ‌స్తి 55.81%, స‌త్య‌వేడు 57.67%, గూడూరు 56.48%, స‌ర్వేప‌ల్లి 57.87%, సూళ్లూరుపేట 56.02%, వెంక‌ట‌గిరి 57.63%.

ఈ రెండేళ్ల‌లో పార్టీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే …తిరుప‌తిలో అనూహ్యంగా వైసీపీ త‌న ఓటింగ్‌ను 11.4% పెంచుకోగ‌లిగింది. తిరుప‌తిలో అధికార పార్టీ భారీగా రిగ్గింగ్‌కు పాల్ప‌డ‌డం వ‌ల్లే వైసీపీకి ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లిగింద‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించ‌డం …కేవలం త‌మ‌ను తాము సంతోష‌ప‌ర‌చ‌డానికే అవుతుంది. తిరుప‌తిలో గ‌తంలో కంటే వైసీపీ కొంత మేర‌కు బ‌ల‌ప‌డిందన్న‌ది వాస్త‌వం. దీన్ని ప్ర‌తిప‌క్షాలు కూడా గ్ర‌హించి, బ‌ల‌ప‌డేందుకు ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు తీసుకుంటే మంచిది. అలా కాకుండా విమ‌ర్శిస్తూ కాలం గ‌డుపుతామంటే చేయ‌గ‌లిగేది కూడా ఏమీ లేదు.

ఇక ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క వ‌ర్గాలైన గూడూరులో గ‌తం కంటే 3.2%, సూళ్లూరుపేట‌లో 5.08% ఓటింగ్‌ను వైసీపీ కోల్పోవ‌డం ఆ పార్టీకి ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తోంది. అలాగే స‌ర్వేప‌ల్లిలో 6.69%, వెంక‌ట‌గిరిలో 1.6% ఓటింగ్‌ను అధికార పార్టీ పెంచుకో గ‌లిగింది. ఇక శ్రీ‌కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ ఎలాంటి పురోగ‌తి సాధించ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించాలి. వైసీపీకి పెరిగిన ఓటింగ్ అంతా కూడా తిరుప‌తి, ఆ త‌ర్వాత స‌ర్వేప‌ల్లిలో కేంద్రీకృతం కావ‌డాన్ని ఆ పార్టీ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి.

అలాగే టీడీపీకి గ‌త ఎన్నిక‌ల్లో 37.56%, ఈ సారి 32.09% ఓటింగ్‌ను సాధించింది. గ‌తంతో పోలిస్తే టీడీపీకి 5.47 శాతం త‌గ్గింది. అలాగే గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే బీజేపీ త‌న ఓటింగ్‌ను పెంచుకుంది. నాడు సొంతంగా పోటీ చేసి 1.22% సాధించ‌గా, నేడు జ‌న సేన‌తో క‌లిసి 5.17% ద‌క్కించుకుంది. అంటే టీడీపీ కోల్పోయిన ఓటింగ్ ఎక్కువ‌గా మ‌రో ప్ర‌తిప‌క్షానికి బ‌దిలీ కావ‌డాన్ని అధికార పార్టీ గుర్తించాలి. అంతే త‌ప్ప త‌మ‌కు కాద‌నే చేదు నిజాన్ని గ్ర‌హించాలి.

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల సొమ్మును సంక్షేమ ప‌థ‌కాల పేరుతో  జ‌గ‌న్ స‌ర్కార్ ప‌ప్పుబెల్లాల మాదిరిగా పంచుతోంద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. గ‌త 23 నెల‌ల్లో ల‌క్ష కోట్ల రూపాయ‌లు పంచినా, ఎందుకు ఆ స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ పొంద‌లేక పోయిందో అధ్య‌య‌నం చేసి గుణ‌పాఠం నేర్చుకోవాల‌ని వైసీపీ అనుకుంటే, తిరుప‌తి ఉప ఎన్నిక ఫ‌లితం ఓ పెద్ద పాఠం అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కానీ ఒక్క‌టి మాత్రం నిజం. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో భారీ మెజార్టీ సాధించామ‌నే ఆనందం ఆ పార్టీలో ఎంత మాత్రం లేదు. పైగా తాను చ‌చ్చీ చెడి 2 శాతం లోపు ఓటు బ్యాంకు పెంచుకోవ‌డం,  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అనుకున్న మేర‌కు దెబ్బ తిన‌క‌పోవ‌డం వైసీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

సొదుం ర‌మ‌ణ‌